తడి ఆరిపోయి పొడిగా మారి, ఎండిపోయిన, కాంతివిహీనమైన పెదాలను చూడడం ఎవరికి మాత్రం ఇష్టం ఉంటుంది చెప్పండి..? అలాంటి పెదాలను ఎవరూ చూడరు సరికదా, వాటిని కావాలని కూడా ఎవరూ కోరుకోరు. ప్రధానంగా మహిళలైతే పెదాల విషయంలో ఒకింత ఎక్కువ శ్రద్ధ కనబరుస్తారనే చెప్పవచ్చు. ఈ క్రమంలో పెదాల సౌందర్యం కోసం చాలా మంది తమ వంతు ప్రయత్నం చేసి ఏవేవో క్రీములు గట్రా రాసి అనుకున్న ఫలితం రాక నిరాశకు లోనవుతుంటారు. అయితే అలాంటి మహిళలెవరూ కూడా అలాంటి నిరాశ చెందాల్సిన పనిలేదు. ఎందుకంటే కింద ఇచ్చిన పలు సహజ సిద్ధమైన సింపుల్ టిప్స్‌ను పాటిస్తే చాలు. పెదాలను ఆకర్షణీయంగా కనిపించేలా, కాంతివంతంగా మారేలా చేసుకోవచ్చు. ఆ టిప్స్ ఏమిటంటే…
లిప్ బామ్‌ను పెదాలకు రాసి కొంత సేపు అయ్యాక టూత్‌బ్రష్‌తో పెదాలపై సున్నితంగా బ్రష్ చేయాలి. అనంతరం ఒక శుభ్రమైన గుడ్డను వేడి నీటిలో ముంచి పెదాలను తుడిచేయాలి. మళ్లీ అవసరం అనుకుంటే లిప్ బామ్ పెట్టి అలాగే చేయాలి. దీంతో పెదాలు మృదువుగా మారుతుంది. పొడిదనం తగ్గుతుంది. ఒక టీస్పూన్ తేనె, 1/2 టీస్పూన్ నిమ్మరసంలను కలిపి ఆ మిశ్రమాన్ని పెదాలకు రాయాలి. దీన్ని 15 నిమిషాలు ఆగాక వేడి నీటితో కడిగేయాలి. రోజూ ఇలా చేస్తుంటే పెదాలు కాంతివంతంగా మారుతాయి. కోల్పోయిన సహజ సిద్ధమైన రంగును తిరిగి పొందుతాయి. ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, ఒక టేబుల్ స్పూన్ చక్కెరను తీసుకుని బాగా కలిపి మిశ్రమంగా చేసుకోవాలి. దీన్ని పెదాలకు రాసి 15 నిమిషాలు ఆగాక వేడి నీటిలో ముంచిన గుడ్డతో తుడిచేయాలి. అవసరం అనుకుంటే మళ్లీ ఇంకోసారి ఇలాగే చేయాలి. ఇలా రోజూ చేస్తూ ఉంటే పెదాలు సౌందర్యాన్ని పొందుతాయి. కాంతివంతంగా మారుతాయి.
అలోవెరా జెల్‌ను కొద్దిగా తీసుకుని పెదాలకు రాయాలి. 15 నిమిషాలు ఆగాక వేడి నీటితో కడిగేయాలి. రోజు ఇలా కనీసం 4,5 సార్లు చేస్తూ ఉంటే పెదాల పగుళ్లు తగ్గిపోయి పెదాలు కాంతివంతంగా మారుతాయి. కొత్త అందాన్ని సొంతం చేసుకుంటాయి. కొన్ని దానిమ్మ గింజలను తీసుకుని వాటి నుంచి జ్యూస్‌ను తీయాలి. ఆ జ్యూస్‌ను ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవాలి. రోజూ కొద్ది మొత్తంలో ఆ జ్యూస్‌ను తీసుకుని అందులో కాటన్ బాల్స్ ముంచి వాటితో పెదాలపై సున్నితంగా మర్దనా చేయాలి. దీని వల్ల పెదాలు ఆకర్షణీయంగా, మృదువుగా మారుతాయి. గులాబీ పూవు రెక్కలను 6,7 తీసుకుని వాటిని అర కప్పు పాలలో రాత్రి పూట నానబెట్టాలి. ఉదయాన్నే పాలను వంపి పూవు రేకులను మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. ఆ పేస్ట్‌కు మళ్లీ కొంచెం పాలను కలిపి ఆ మిశ్రమాన్ని పెదాలకు రాయాలి. కొంత సేపటి తరువాత కడిగేయాలి. రోజూ ఇలా చేయడం వల్ల పెదాలు ప్రకాశవంతంగా మారుతాయి.
నిమ్మరసం, గ్లిజరిన్‌లను సమాన భాగాల్లో తీసుకుని మిశ్రమంగా కలుపుకుని దాన్ని పెదాలకు రాసి 15 నిమిషాలు ఆగాక వేడి నీటితో కడిగేయాలి. దీంతో పెదాలు మృదువుగా మారుతాయి. కొన్ని కొత్తిమీర ఆకులను తీసుకుని బాగా నలిపి మిశ్రమంగా చేసుకోవాలి. దీన్ని పెదాలకు రాసి 30 నిమిషాల పాటు వేచి ఉండాలి. అనంతరం వేడి నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల పెదాలు సహజ సిద్ధమైన రంగును పొందుతాయి. మృదువుగా కూడా మారుతాయి. రాత్రి పూట నిద్రకు ఉపక్రమించే ముందు కొద్దిగా కొబ్బరి నూనె తీసుకుని పెదాలకు రాసి ఉదయాన్నే కడిగేయాలి. దీంతో పెదాల పొడితనం తగ్గుతుంది. మృదువుగా కూడా మారుతాయి. ఒకటి రెండు బాదం పప్పు పలుకులను తీసుకుని నలిపి పెదాలకు రాసి కొంత సేపు ఆగాక కడిగేసినా పెదాలు మృదువుగా మారుతాయి. కాంతివంతంగా తయారవుతాయి.