దోమలు.. కాలంతో సంబంధం లేకుండా ప్రతి కాలంలోనూ ఇవి మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ వీటి కాటుకు గురి కావల్సి వస్తోంది. వర్షాకాలంలో వీటి సంఖ్య మరీ ఎక్కువగా ఉంటోంది. దోమకాటు వల్ల జ్వరాల బారిన పడే వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువవుతోంది. ఈ దోమల్ని నివారించడానికి మనం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. మార్కెట్ లో దొరికే అన్ని రకాల రిఫిల్స్ ను, కాయిల్స్ ను, దోమల బ్యాట్ లను, దోమ తెరలను, దోమలు కుట్టకుండా నివారించే క్రీములను వాడినప్పటికీ ఎటువంటి ఫలితం లేకుండా పోతోంది.
అంతేకాకుండా రసాయనాలు కలిగిన కాయిల్స్ ను, రిఫిల్స్ ను తరచూ వాడడం వల్ల మనకు శ్వాసకోస సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో వీటిని ఉపయోగించకపోవడమే మంచిది. దోమలను నివారించడానికి రసాయనాలు కలిగిన రిఫిల్స్ ను వాడడం వల్ల వాటి ప్రభావం పిల్లల ఆరోగ్యంపై తీవ్రంగా పడుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. సహజ సిద్ధంగా కూడా మనం దోమలను నివారించుకోవచ్చు. ఇంట్లో ఉండే వస్తువులతో దోమలను ఎలా నివారించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇందుకోసం మనం రెండు టేబుల్ స్పూన్ల వేపనూనెను, 4 లేదా 5 కర్పూరం బిళ్లలను, బిర్యానీ ఆకులను ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా కర్పూరం బిళ్లలను రోట్లో వేసి మెత్తగా దంచి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులోనే వేపనూనెను కూడా వేసి కలపాలి. తరువాత ఈ నూనెను దూదితో లేదా కాటన్ వస్త్రం సహాయంతో బిర్యానీ ఆకు మీద రాయాలి. ఇలా రాసిన తరువాత బిర్యానీ ఆకును కాల్చాలి. బిర్యానీ ఆకును కాల్చడం వల్ల వచ్చే పొగ కారణంగా మన ఇంట్లో ఉండే దోమలు బయటకు పోవడం లేదా నశించడం జరుగుతుంది.
అంతేకాకుండా ఈ పొగను మనం పీల్చడం వల్ల మనకు ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుంది. దోమలను నివారించడానికి మనం అన్నీ కూడా సహజసిద్ధమైన పదార్థాలనే వాడుతున్నాం. కనుక మన ఆరోగ్యానికి కూడా ఎటువంటి హాని కలగకుండా ఉంటుంది. ఈ చిట్కాను పాటించడంతోపాటు మన ఇంటి చుట్టూ పరిసరాలు కూడా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. అలాగే ఇంట్లో, ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. దోమ కాటుకు గురై జ్వరాల బారిన పడడానికి బదులుగా దోమలను నివారించుకోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.