Guava For Diabetes : ప్రస్తుత కాలంలో మనల్ని వేధిస్తున్న అనారోగ్య సమస్యల్లో షుగర్ వ్యాధి కూడా ఒకటి. షుగర్ వ్యాధితో బాధపడే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుందనే చెప్పవచ్చు. మారిన మన జీవన విధానం, ఆహారపు అలవాట్లే ఈ సమస్య బారిన పడడానికి ప్రధాన కారణమని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. యుక్త వయసులోనే చాలా మంది షుగర్ వ్యాధి బారిన పడి అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఒక్కసారి ఈ సమస్య బారిన పడితే జీవితాంతం మనం మందులు మింగాల్సిందే. అలాగే ఆహార నియమాలను కూడా పాటించాలి. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచే ఆహారాలను మాత్రమే తీసుకోవాలి. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచే ఆహారాల్లో జామ కాయ కూడా ఒకటి. జామ కాయ మనకు సంవత్సరం పొడవునా విరివిగా లభిస్తుంది.
చాలా మంది జామకాయలను ఇష్టంగా తింటారు. షుగర్ వ్యాధి గ్రస్తులు ఏ పండు తిన్నా తినకున్నా జామకాయను మాత్రం తప్పకుండా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. జామకాయలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే జామకాయ చాలా తక్కువ గ్లైసీమిక్ ఇండెక్స్ ను కలిగి ఉంటుంది. జామకాయ 10 నుండి 12 గ్లైసీమిక్ ఇండెక్స్ ను కలిగి ఉంటుంది. జామకాయను తిన్న చాలా సేపటి తరువాత చక్కెరలు నెమ్మదిగా రక్తంలో కలుస్తాయి. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా అదుపులో ఉంటాయి. షుగర్ వ్యాధితో బాధపడే వారు రోజూ రెండు జామకాయలను రెండు పూటలా తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా లేత జామ ఆకులను తినడం వల్ల భవిష్యత్తులో షుగర్ వ్యాధి రాకుండా ఉంటుందని కూడా వారు చెబుతున్నారు.
లేత జామ ఆకులకు ఇన్సులిన్ నిరోధకతను తగ్గించే గుణం ఉంటుంది. లేత జామ ఆకులను తినడం వల్ల ఇన్సులిన్ నిరోధకత తగ్గి షుగర్ వ్యాధి రాకుండా ఉంటుంది. ఈ విధంగా షుగర్ వ్యాధితో బాధపడే వారు జామకాయలను లేదా జామ పండ్లను అలాగే షుగర్ వ్యాధి రాకూడదు అనుకునే వారు లేత జామ ఆకులను నమిలి తినాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే వర్షాకాలంలో జామకాయలను తప్పకుండా తీసుకోవాలని కూడా వారు చెబుతున్నారు. జామకాయలను తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి ఇన్ఫెక్షన్ ల బారిన పడకుండా ఉంటామని నిపుణులు చెబుతున్నారు.