Anantha Padmanabha Swamy Temple : పూర్వకాలంలో రాజులు నిధి నిక్షేపాలు ఎవరి కంటపడకుండా సురక్షితంగా ఉండేందుకు తాంత్రికుల సహాయంతో వాటికి భూత ప్రేత పిశాచ నాగ గణాలతో బంధనం వేసేవారు. మంత్ర యంత్ర తాంత్రిక శాస్త్రాల్లో నిష్ణాతులైన మహా తాంత్రికులచే వేయబడిన బంధం ఎన్ని వేల సంవత్సరాల పాటైనా చాలా శక్తివంతంగా పని చేస్తుంది. ఎవరైనా సరే బలప్రయోగంతో ఆ నిధిని దక్కించుకోవాలని చూస్తే ఆ నిధికి కాపలాగా ఉన్న గణాలు వారిని అంతం చేస్తాయి. కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆరవ గదికి ఉన్న నాగబంధం కూడా ఇలా వేసిందే.
ట్రావెన్ కోర్ రాజవంశస్థుడైన మార్తాండ వర్మ ఎంతో విలువైన పద్మనాభుని సంపద పరుల చేతికి చిక్కకూడదని భావించి తన రాజ్యంలో యాంత్రిక తాంత్రిక విద్యలలో ఘనాపాటిలైన వారిని రప్పించి వజ్ర వైఢూర్య మరకత మాణిక్యలతో నిండి ఉన్న ఆరవ గదికి నాగ బంధం వేయించాడు. కొన్ని వందల సంవత్సరాల నుండి ఇప్పటి వరకు ఈ నాగ బంధం ఎంతో పటిష్టంగా ఉంది. ఈ బంధాన్ని ఉపసంహారం చేయకుండా బలవంతంగా గది తెరిస్తే ఆ గదికి కాపలాగా ఉన్న కాల నాగులు వారిపై విరుచుకుపడి అంతం చేస్తాయట. అంతేకాక ఆ గది నుండి సముద్రం వరకు ఒక సొరంగ మార్గం ఉందట. అధర్మపద్దతిలో ఆ గదిని తెరవగానే సముద్ర జలాలు ఆ ప్రదేశం అంతా చుట్టి ముట్టి సంపద అంతటిని సముద్ర గర్భంలో నిక్షిప్తం చేసుకుంటాయని చెప్తుంటారు.
ఎంతో పటిష్టంగా ఉన్న ఈ నాగ బంధాన్ని అసలు తెరవలేమా అంటే తప్పకుండా చేయవచ్చు. కానీ అది చాలా కష్టంతో కూడుకున్నది. క్షీర సాగర మధనం సమయంలో శరీరాలను కోల్పోయిన రాహువు, కేతువులకు తమ శరీరాలను సర్పాలు ఇస్తాయి. ఈ సహాయానికి ప్రతిఫలంగా మంత్ర తంత్రాలకు మీ నాగులు అధిష్టాన దేవతలుగా ఉంటారని రాహువు, కేతువులు సర్పాలకు వరాన్ని ఇస్తారు. ఇలా అష్ట దిక్కులకు అనంత, వాసుకి, తక్షక, కర్కోటక వంటి నాగమణులను అధిష్టాన దేవతలుగా ఉంచుతారు. మంత్రము, యంత్రము, తంత్రము, క్రియ, ముద్ర, జ్ఞానము అనే ఆరింటితో నాగ బంధం వేస్తారు. ఇలా వేసే సమయంలో ఒక్కో దానికి ఒక్కో నాగ దేవతను ఆవహనం చేసి ఆ నిధికి కాపలాగా ఉంచుతారు.
ఒకవేళ ఆ బంధాన్ని విప్పాలంటే ఆ ఆరింటికి ఏ మంత్రాలు పఠించి ఆవాహన చేశారో మరలా అదే వరుస క్రమంలో స్వఛమైన ఉచ్ఛారణతో అవే మంత్రాలు పఠించినప్పుడు ఆ బంధం విడుదలవుతుంది. ఈ క్రమం ఎక్కడ తప్పు పోయినా సరే ఆ బంధం వికటించి కాపలాగా ఉన్న నాగ గణాలు వారి మీద విరుచుకుపడి అంతం చేస్తాయి. ప్రస్తుతం ఈ నాగ బంధం విప్పే తాంత్రికులు కేరళలలోని దట్టమైన అడువుల్లో మాత్రమే ఉన్నారట. కానీ వారు కావాలని కనిపిస్తే తప్ప మానవ మాంత్రికులకు ఎవరికీ కనబడరట. అలాగే ఈ నాగ బంధాన్ని ఎలా విప్పాలనే తాళపత్ర గ్రంథం అనంతపద్మ నాభస్వామి ఆలయానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఒక గుహలో అత్యంత రహస్యంగా కాలనాగుల సంరక్షణలో ఉందట. ఈ రహస్య తాళపత్ర గంథ్రాల గురించి అప్పట్లో ఎవరైతే ఈ బంధం వేశారో వారి వారసులకు మాత్రమే తెలుసట.
కానీ ఈ రహస్య వారికి తెలిసిన వారు ఒక్కరే ఈ రహస్యాన్ని చేధించ లేరు. ఈ నాగబంధం వేయించిన రాజవంశస్థుల సమక్షంలో వారి అనుమతితో మాత్రమే ఈ బంధాన్ని విడుదల చేయడం సాధ్యమైవుతుందట. మరో కథనం ప్రకారం ద్వాపర యుగంలో బలరాముడు 108 విష్ణు ఆలయాలను కట్టించి ఆ ఆలయాల్లో శమంతకమణి ద్వారా వచ్చిన మణిమాణిక్యాలను నిక్షిప్తం చేయించాడట. మిగతా 107 వైష్ణవ ఆలయాల్లో సంపద రహస్య స్థావరాల్లో భద్రంగా ఉండగా అనంత పద్మనాభ స్వామి అలయంలో ఉన్న సంపద గురించి మాత్రమే వెలుగులోకి వచ్చిందట. ఈ సంపదను బహిర్గతం చేయడం దేశానికి చాలా అరిష్టమని పండితులు చెబుతున్నారు. ఆరవ గదిని తెరవకపోయినా మిగిలిన గదులను తెరవడంతో ఆ నాగబంధం ప్రభావం ఇప్పటికే ప్రారంభమైందని అదే మహమ్మారి రూపంలో దేశం మీద విరుచుకుపడుతుందని నాగశాస్త్రం తెలిసిన పండితులు చెబుతున్నారు. మరి ఆ గదిని ఎప్పటికైనా తెరుస్తారా.. లేదా.. అనేది చూడాలి.