Hibiscus Oil For Hair Growth : జుట్టు రాలడం, జుట్టు చిట్లడం, జుట్టు పొడిబారడం, జుట్టు పెరగడం ఆగి పోవడం వంటి జుట్టు సంబంధిత సమస్యలతో బాధపడే వారు ప్రస్తుత కాలంలో ఎక్కువవుతున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఆ సమస్యల బారిన పడుతున్నారు. జుట్టుకు సంబంధించిన ఇటువంటి సమస్యల బారిన పడడానికి అనేక కారణాలు ఉంటాయి. వాతావరణ కాలుష్యం, సరైన పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోకపోవడం, రసాయనాలు కలిగిన షాంపులను ఎక్కువగా వాడడం, మానసిక ఒత్తిడి, డిప్రెషన్, ఆందోళన వంటి అనేక రకాల చేత ఈ జుట్టు సంబంధింత సమస్యలు తలెత్తుతున్నాయి. సమస్యలు తగ్గి జుట్టు అందంగా, ఒత్తుగా కనబడాలని మనం చేయని ప్రయత్నం అంటూ ఉండదు.
అందుకోసం ఎంతో ఖర్చూ చేస్తూ ఉంటాము కూడా. ఎటువంటి ఖర్చు లేకుండా కేవలం ఇంట్లో ఉండే పదార్థాలతో ఈ జుట్టు సమస్యలన్నింటిని తగ్గించుకోవచ్చు. ఒక చిన్న ఇంటి చిట్కాను ఉపయోగించి మనం మన జుట్టును అందంగా, ఒత్తుగా మార్చుకోవచ్చు. జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టును పట్టులా మార్చే ఇంటి చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జుట్టును సమస్యలను తగ్గించడంలో మనకు మందార పువ్వులు, మందార ఆకులు ఎంతగానో ఉపయోగపడతాయి. ఎంతోకాలం నుండి ఈ మందార పువ్వులను, ఆకులను మనం జుట్టు సంరక్షణలో ఉపయోగిస్తూ ఉన్నాం. మందారలో ఉండే ఔషధ గుణాలు జుట్టు సమస్యలను తగ్గించడంలో ఎంతగానో సహాయపడతాయి. అలాగే ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి మనం కొబ్బరి నూనెను కూడా ఉపయోగించాల్సి ఉంటుంది.
దీని కోసం ముందుగా 5 లేదా 6 మందార ఆకులను తీసుకుని శుభ్రంగా కడగాలి. తరువాత 5 ఒంటి రెక్క మందారాలను తీసుకుని వాటి రేకులను సేకరించాలి. ఇప్పుడు ఒక జార్ లో లేదా రోట్లో ఈ మందార ఆకులను, మందార పువ్వుల రేకులను వేసి మెత్తగా పేస్ట్ గా చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో కొబ్బరి నూనెను తీసుకుని వేడి చేయాలి. నూనె వేడయ్యాక అందులో మందార ఆకుల మిశ్రమాన్ని వేసి కలపాలి. ఈ నూనెను మరో రెండు నుండి మూడు నిమిషాల పాటు వేడి చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ నూనె చల్లారిన తరువాత దానిని వడకట్టి గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న నూనెను జుట్టు కుదుళ్ల నుండి జుట్టు చివర్ల వరకు బాగా పట్టించాలి.
తరువాత నూనె చర్మంలోకి ఇంకేలా సున్నితంగా మర్దనా చేసుకోవాలి. ఇలా జుట్టుకు నూనె రాసుకుని ఒక గంట పాటు అలాగే ఉండాలి. తరువాత రసాయనాలు తక్కువగా ఉండే షాంపుతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు నుండి మూడు సార్లు చేయడం వల్ల జుట్టు కుదుళ్లు బలంగా మారి జుట్టు రాలడం తగ్గుతుంది. జుట్టు పొడిబారడం, జుట్టు తెగడం, చిట్లడం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. జుట్టు సంబంధిత సమస్యలతో బాధపడే వారు ఈ చిట్కాను పాటించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.