Beerakaya Pappu : బీర‌కాయ‌ల‌తో ప‌ప్పును ఇలా చేస్తే.. ఎవ‌రైనా స‌రే లొట్ట‌లేసుకుంటూ మొత్తం తినేస్తారు..

Beerakaya Pappu : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌లో బీర‌కాయ ఒక‌టి. బీర‌కాయ‌లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పీచు ప‌దార్థాలు, విట‌మిన్స్, మిన‌ర‌ల్స్ అనేకం ఉంటాయి. జీర్ణ సంబంధింత స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో, బ‌రువు త‌గ్గ‌డంలో ఇవి మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. బీర‌కాయ‌ల‌తో చేసుకోద‌గ‌ని వంట‌కాల్లో బీర‌కాయ ప‌ప్పు ఒక‌టి. వంటింట్లో ఈ వంట‌కాన్ని త‌ర‌చూ చేస్తూనే ఉంటారు. చాలా మంది ఈ పప్పును ఇష్టంగా తింటారు. బీర‌కాయ ప‌ప్పును మ‌రింత రుచిగా ఎలాత‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

బీర‌కాయ ప‌ప్పు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బీర‌కాయ‌లు – పావు కిలో, కందిపప్పు – 150 గ్రా., నాన‌బెట్టిన చింత‌పండు – చిన్న నిమ్మ‌కాయంత‌, త‌రిగిన ఉల్లిపాయ – 1, త‌రిగిన ట‌మాటాలు – 2, క‌చ్చా ప‌చ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు – 4, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 4, తాళింపు దినుస‌లు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 2, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, కారం – ఒక టేబుల్ స్పూన్, ప‌సుపు – అర టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, నూనె – 2 టేబుల్ స్పూన్స్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, నీళ్లు – ఒక గ్లాస్, ఇంగువ – ఒక టీ స్పూన్.

Beerakaya Pappu recipe in telugu tastes better if you make it
Beerakaya Pappu

బీర‌కాయ ప‌ప్పు త‌యారీ విధానం..

ముందుగా బీర‌కాయ‌ల‌పై ఉండే పొట్టును తీసేసి శుభ్రంగా క‌డిగి ముక్క‌లుగా చేసుకోవాలి. త‌రువాత ఒక కుక్క‌ర్ లో కందిపప్పును తీసుకుని శుబ్రంగా క‌డ‌గాలి. త‌రువాత అందులో ప‌సుపు, నీళ్లు, ఒక టీ స్పూన్ నూనెను వేసుకోవాలి. త‌రువాత కుక్క‌ర్ మీద మూత పెట్టి మ‌ధ్య‌స్థ మంట‌పై 3 విజిల్స్ వ‌చ్చే వ‌ర‌కు ఉడికించుకోవాలి. త‌రువాత కుక్క‌ర్ మూత తీసి ప‌ప్పును మెత్త‌గా చేసుకోవాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక తాళింపు దినుసులు వేసి వేయించాలి. త‌రువాత ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బ‌లు, ఇంగువ, క‌రివేపాకు వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు, ప‌చ్చిమిర్చి వేసి వేయించాలి. ఇవి వేగిన త‌రువాత బీర‌కాయ ముక్క‌లు, ఉప్పు, ప‌సుపు వేసి క‌ల‌పాలి. త‌రువాత వీటిపై మూత‌ను ఉంచి బీర‌కాయ ముక్క‌లను మెత్త‌గా అయ్యే వ‌ర‌కు వేయించాలి.

బీర‌కాయ ముక్క‌లు ఉడికిన త‌రువాత ట‌మాట ముక్కలు వేసి క‌లిపి ట‌మాట ముక్క‌లు మెత్త‌గా అయ్యే వ‌ర‌కు వేయించాలి. ట‌మాట ముక్క‌లు మెత్త‌గా అయిన త‌రువాత కారం వేసి క‌ల‌పాలి. త‌రువాత ముందుగా ఉడికించుకున్న ప‌ప్పు, చింత‌పండుర‌సం, పావు గ్లాస్ నీళ్లు పోసి క‌లపాలి. త‌రువాత మూత పెట్టి 10 నిమిషాల పాటు మ‌ధ్య‌స్థ మంట‌పై ఉడికించాలి. చివ‌ర‌గా ఇందులో కొత్తిమీర‌ను వేసి క‌లిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే బీరకాయ ప‌ప్పు త‌యార‌వుతుంది. ఈ పప్పును వేడి వేడిగా అన్నంలో నెయ్యితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. అన్నంతో పాటు చ‌పాతీ, రోటి, పుల్కా వంటి వాటితో కూడా ఈ ప‌ప్పును తిన‌వ‌చ్చు. ఈ విధంగా బీర‌కాయ‌తో ప‌ప్పును చేసుకుని తిన‌డం వ‌ల్ల రుచితో వివిధ ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌వ‌చ్చు.

Share
D

Recent Posts