ఫుడ్ పాయిజనింగ్ అవడం, జీర్ణాశయ ఫ్లూ, ఇన్‌ఫెక్షన్లు వంటి అనేక సమస్యల కారణంగా కొందరికి వాంతులు అవుతుంటాయి. ఇంకొందరికి వాంతులు కావు.. కానీ వచ్చినట్లు అనిపిస్తుంది. కొందరికి వికారం కూడా ఉంటుంది. అయితే ఇందుకు ఆందోళన చెందాల్సిన పనిలేదు. పలు ఇంటి చిట్కాల ద్వారానే ఈ సమస్యల నుంచి సులభంగా బయట పడవచ్చు. అవేమిటంటే..
1. ఒక టీస్పూన్ అల్లం రసం, ఒక టీస్పూన్ తేనెలను అరకప్పు నీటిలో కలిపి రోజంతా తాగుతుండాలి. దీని వల్ల వికారం, వాంతులు తగ్గుతాయి. జీర్ణాశయంలో ఏర్పడే అసౌకర్యాన్ని అల్లం తగ్గిస్తుంది. అలాగే అల్లం ముక్కలను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని కూడా తాగవచ్చు. రోజూ ఉదయాన్నే పరగడుపునే ఒక టీస్పూన్ అల్లం రసం కూడా తీసుకోవచ్చు. దీంతో వికారం, వాంతుల సమస్యల నుంచి బయట పడవచ్చు.
2. ఒకటి లేదా రెండు లవంగాలను నోట్లో బుగ్గన పెట్టుకుని ఎల్లప్పుడూ చప్పరిస్తుండాలి. దీంతో వాంతులు తగ్గుతాయి. నోరు కోల్పోయిన రుచిని తిరిగి పొందుతుంది. అలాగే నీటిలో లవంగాలు వేసి మరిగించి ఆ నీటిని తాగవచ్చు. దీని వల్ల కూడా ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు.
3. శరీరంలో కొన్నిసార్లు లవణాల అసమతుల్యత వల్ల కూడా వికారం, వాంతికి వచ్చినట్లు ఉండడం అనిపిస్తాయి. కనుక చక్కెర, ఉప్పు మిశ్రమాన్ని తాగుతుండాలి. దీంతో లవణాలు సమతుల్యం అవుతాయి. శరీరం డీహైడ్రేషన్ కాకుండా ఉంటుంది. నీరసం తగ్గుతుంది.
4. ఒక గ్లాస్ నీటిలో కొద్దిగా నిమ్మరసం కలిపి తాగుతుండాలి. అందులో తేనె కూడా కలిపి తీసుకోవచ్చు. దీని వల్ల వాంతులు, వికారం సమస్యలు తగ్గుతాయి.
5. సోంపు గింజలను తినడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. నోటికి సోంపు గింజలు తాజా దనాన్ని అందిస్తాయి. దీంతో జీర్ణాశయంలో ఉండే అసౌకర్యం తగ్గుతుంది. వాంతులు, వికారం తగ్గిపోతాయి. ఒక పాత్రలో నీటిని తీసుకుని అందులో కొన్ని సోంపు గింజలను వేసి మరిగించి ఆ నీటిని తాగుతుండాలి. ఇలా చేసినా ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు.
6. నారింజ పండు జ్యూస్ తాగడం వల్ల శరీరం కోల్పోయిన మినరల్స్, విటమిన్లు, ఇతర పోషకాలు అందుతాయి. దీంతో బీపీ నియంత్రణలోకి వస్తుంది. నారింజ పండ్లను నేరుగా తిన్నా వాంతులు, వికారం తగ్గుతాయి.
వాంతులు, వికారం సమస్యలు ఉన్నవారు ఎక్కువ విశ్రాంతి తీసుకోవాలి. సమస్యలు తగ్గేవరకు పనిచేయకూడదు. లేదంటే అవి మరింత ఎక్కువవుతాయి. అలాగే వెల్లకిలా పడుకోవడం ఉత్తమం. ఆయా చిట్కాలను పాటించినా ఆ సమస్యలు తగ్గడం లేదంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యున్ని సంప్రదించి చికిత్స తీసుకోవాలి.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365