సైనస్ ఉన్నవాళ్లకు తీవ్రమైన నొప్పి కలుగుతుంది. అది వారిని అవస్థలకు గురి చేస్తుంది. సైనస్లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి అక్యూట్. రెండోది క్రానిక్. క్రానిక్ సైనుసైటిస్ ఉన్నవారికి యాంటీ బయోటిక్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అదే అక్యూట్ సైనుసైటిస్ ఉన్నవారికి ఇంటి చిట్కాలు పనిచేస్తాయి. డస్ట్ ఎలర్జీ, రసాయనాలు లేదా ఇతర పదార్థాలు వంటి వాటి వల్ల సైనస్ ఇన్ఫెక్షన్ వస్తుంది. నాసికా మార్గాలు వాపులకు గురై ఇన్ఫెక్షన్ బారిన పడినప్పుడు సైనస్ వస్తుంది. దీంతో తలనొప్పి, ముఖం నొప్పి, ముక్కులో నొప్పిగా ఉండడం, చెవులు, దంతాల నొప్పులు, జ్వరం, ముఖం వాయడం, గొంతు నొప్పి, ముక్కు దిబ్బడ, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయి.
పైన తెలిపిన లక్షణాలు ఎవరిలో అయినా ఉంటే దాన్ని సైనస్‌గా అనుమానించాలి. వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకుని సైనస్ ఉన్నదీ, లేనిదీ నిర్దారించుకోవాలి. సైనస్ ఉంటే వైద్యులు సూచించిన విధంగా మందులను వాడాలి. ఇక కొన్ని ఇంటి చిట్కాల ద్వారా కూడా సైనస్ సమస్య నుంచి బయట పడవచ్చు.
వేపుళ్లు, ఫ్రైడ్ రైస్, మసాలాలు, కారం అధికంగా ఉండే ఆహారాలను తినడంవల్ల సైనస్ బయట పడుతుంది. సైనస్ సమస్య ఉన్నవారు చల్లని పానీయాలు తాగరాదు. విటమిన్ ఎ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల సైనస్ సమస్య నుంచి బయట పడవచ్చు.
1. సైనస్ సమస్య ఉన్నవారు ద్రవాహారం ఎక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచేందుకు నీటిని ఎక్కువగా తాగాలి. దీంతో డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. సైనస్ లక్షణాలు బాధించవు. నొప్పులు తగ్గుతాయి. శ్వాసకోశ వ్యవస్థలో ఉండే మ్యూకస్ పలుచగా అవుతుంది. నాసికా మార్గాంలో అడ్డంకులు తొలగిపోతాయి. శ్వాస సరిగ్గా ఆడుతుంది.
2. ఒక పాత్రలో నీటిని తీసుకుని అందులో పుదీనా ఆకులు వేసి బాగా మరిగించాలి. ఆ నీటి నుంచి వచ్చే ఆవిరిని బాగా పీల్చాలి. రోజుకు 2 సార్లు ఇలా చేస్తే సైనస్ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. నాసికా మార్గంలో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. నొప్పులు, ఇర్రిటేషన్ తగ్గుతాయి.
3. సైనస్ సమస్య ఉన్నవారు వేడి వేడి సూప్‌లను తాగితే ఫలితం ఉంటుంది. దీంతో ముక్కు దిబ్బడ తగ్గుతుంది. శ్వాస సరిగ్గా ఆడుతుంది.
4. జలనేతి ప్రక్రియను అనుసరించడం ద్వారా సైనస్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. జలనేతి అనేది ఒక యోగా ప్రక్రియ. ఇందులో భాగంగా అర లీటరు నీటికి ఒక టీస్పూను సైంధవ లవణం గానీ అయోడిన్ లేని సముద్రపు ఉప్పును గానీ బాగా కలిపి బాగా మరిగించి గోరువెచ్చగా అయిన తరువాత జలనేతి కోసం ప్రత్యేకంగా తయారు చేసిన పరికరం (జల నేతి పోట్) ను ఉపయోగించి ముక్కులోని ఒక రంధ్రం ద్వారా నీటిని పంపితే ముక్కు యొక్క మరొక రంధ్రం ద్వారా ఆనీరు బయటకు వచ్చేస్తుంది. దీంతో ముక్కులో ఉండే మలినాలన్నీ బయటకు వస్తాయి. శ్వాస ఇబ్బందులు తొలగిపోతాయి. సైనస్ నుంచి ఉపశమనం పొందుతారు. ముక్కు రెండు రంధ్రాలనూ ఇదే ప్రక్రియలో శుభ్రపరుచుకోవాలి. సాధారణంగా ముక్కు ద్వారా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగినపుడు, ముక్కు దిబ్బడ లేదా ఆస్తమాతో బాధ పడుతున్నప్పుడు, సైనసైటిస్ తో బాధపడుతున్నప్పుడు ఉపశమనం కోసం ఈ యోగా ప్రక్రియ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ప్రక్రియను సాధన చేయడానికి ముందు గురువు వద్ద సలహాలు, సూచనలను తీసుకోవాలి.
5. యాపిల్ సైడర్ వెనిగర్ ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తుంది. సైనస్ నొప్పులను తగ్గిస్తుంది. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో అర టీస్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్‌ను కలిపి తాగాలి. లేదా దాంతో టీ తయారు చేసుకుని తాగాలి. సైనస్ నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
6. అల్లంతో తయారు చేసిన కషాయాన్ని రోజుకు 2 సార్లు తాగాలి. లేదా ఒక టీస్పూన్ అల్లం రసం, ఒక టీస్పూన్ తేనెలను కలిపి రోజుకు 3 సార్లు తీసుకోవాలి. సైనస్ నుంచి ఉపశమనం లభిస్తుంది.
7. అర కప్పు గోరు వెచ్చని నీటిలో అర టీస్పూన్ ఉప్పును వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని చిన్న స్క్వీజ్ బాటిల్లో పోయాలి. దాని నుంచి 5 చుక్కలను ఒక నాసికా రంధ్రంలో వేయాలి. ఆ చుక్కలు ఇంకో నాసికా రంధ్రం ద్వారా బయటకు వచ్చేట్లు తలను తిప్పాలి. ఇలా రెండో నాసికా రంధ్రంతోనూ చేయాలి. దీంతో ముక్కులో ఉండే బాక్టీరియా నశిస్తుంది. సైనస్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365