ఆహార వాహికలో ఏదైనా అడ్డం పడినప్పుడు ఎవరికైనా ఎక్కిళ్లు వస్తాయి. సహజంగా ఇవి కొందరికి భోజనం చేస్తున్నప్పుడు వస్తే మరికొందరికి నీళ్లు వంటి ద్రవాలు తాగుతున్నప్పుడు, ఇంకొందరికి ఇతర సమయాల్లోనూ వస్తాయి. అయితే ఈ ఎక్కిళ్లు సాధారణంగా అప్పటికప్పుడే తగ్గిపోతాయి. కానీ కొందరికి మాత్రం పదే పదే ఆపకుండా అలా ఎక్కిళ్లు వస్తూనే ఉంటాయి. ఈ క్రమంలో అలాంటి ఎక్కిళ్లను తగ్గించుకునేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
భోజనం చేసే సమయలో ఆహారాన్ని వేగంగా తినకూడదు. దీని వల్ల నోట్లోకి గాలి ఎక్కువగా వెళ్లి ఎక్కిళ్లు వస్తాయి. చిన్న అల్లం ముక్కను తీసుకుని నోట్లో వేసుకుని బాగా నమిలి చప్పరిస్తుంటే ఎక్కిళ్లు పోతాయి. వెనిగర్‌ను తీసుకుని రెండు, మూడు చుక్కలను నాలుక మీద వేసుకోవాలి. దీంతో ఎక్కిళ్లు తగ్గుముఖం పడతాయి. ఒక కప్పు నీటిలో యాలకుల పొడిని వేసి ఆ నీటిని బాగా కాచాలి. అనంతరం వచ్చే కషాయాన్ని తాగితే ఎక్కిళ్లు పోతాయి.
ఆవాల పొడిలో నెయ్యి కలిపి తింటున్నా ఎక్కిళ్లు తగ్గిపోతాయి. ఏదైనా తీపి పదార్థాన్ని నోట్లో వేసుకుని తిన్నా ఎక్కిళ్లను తగ్గించుకోవచ్చు. ఎక్కిళ్లు వస్తున్న సమయంలో గాలిని బాగా పీల్చుకుని 30 సెకండ్ల పాటు గాలిని లోపలే బంధించాలి. అనంతరం శ్వాసను వదలాలి. దీంతో ఎక్కిళ్లు పోతాయి. నిమ్మకాయను కట్ చేసి ఆ ముక్కలను కొరుకుతూ తింటున్నా ఎక్కిళ్లను తగ్గించుకోవచ్చు. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా తేనెను వేసి బాగా కలిపి తాగినా ఎక్కిళ్లు తగ్గిపోతాయి. నిలబడి సగం వరకు శరీరాన్ని బెండ్ చేసి ఆ భంగిమలో నీటిని తాగాలి. దీంతో ఎక్కిళ్లు ఆగిపోతాయి.