Itchy And Dry Skin In Winter : చలికాలంలో ఉండే అతి తక్కువ ఉష్ణోగ్రతల కారణంగా చర్మం మరింత ఎక్కువగా పొడిబారుతుంది. అలాగే చలికాలంలో ఎక్కువగా వేడి నీటితో స్నానం చేయడం, అలాగే వాతావరణ కాలుష్యం, దుమ్ము కారణంగా చర్మం పొడిబారడంతో పాటు ఎగ్జిమా, సోరియాసిస్ వంటి చర్మ సమస్యలు తలెత్తుతాయి. కనుక మనం చలికాలంలో మరింత ఎక్కువగా చర్మ సంరక్షణ చర్యలను తీసుకోవాలి. చలికాలంలో చర్మం తేమగా ఉండడానికి ఖరీదైన లోషన్లను, మాయిశ్చరైజర్లను వాడుతూ ఉంటారు. వీటిని వాడడానికి బదులుగా కొన్ని సహజమైన చిట్కాలను వాడడం వల్ల మనం చర్మం పొడిబారకుండా కాపాడుకోవచ్చు. అలాగే చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా మార్చుకోవచ్చు. చలికాలంలో లోషన్లకు బదులుగా కొబ్బరి నూనెను వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కొబ్బరి నూనె చర్మంలోకి ఎక్కువగా శోషించబడుతుంది.
కొబ్బరి నూనెను రాసుకోవడం చర్మం పొడిబారడం తగ్గుతుంది. అలాగే దీనిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ ప్లామేషన్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. చర్మానికి కొబ్బరి నూనెను రాసుకోవడం వల్ల తామర, సోరియాసిస్, దురద వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయితే ఎప్పుడూ కూడా కోల్డ్ ప్రెస్డ్ కొబ్బరి నూనెను వాడడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. అలాగే చలికాలంలో కలబంద జెల్ ను వాడడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. కలబంద జెల్ ను వాడడం వల్ల చర్మం ఎల్లప్పుడూ తేమగా ఉంటుంది. చర్మం పొడిబారడం తగ్గుతుంది. అంతేకాకుండా కలబంద జెల్ ను వాడడం వల్ల దురద, తామర, చికాకు, చర్మం ఎరుపెక్కడం వంటి చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి. అదే విధంగా పసుపును వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. పసుపులో నీరు లేదా నూనె కలిపి నేరుగా చర్మానికి రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మంలో ఇన్ ప్లామేషన్ తగ్గుతుంది. ఇన్పెక్షన్ లు రాకుండా ఉంటాయి.
చర్మం ఎర్రగా మారడం, దురద, తామర, సొరియాసిస్ వంటి చర్మ సమస్యలు తగ్గుతాయి. పసుపును వాడడం వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతుంది. అలాగే శుద్దమైన పొద్దు తిరుగుడు గింజల నూనెను వాడడం వల్ల కూడా చర్మం పొడిబారకుండా ఉంటుంది. ఈ నూనెను చర్మానికి రాసుకోవడం వల్ల చాలా సమయం వరకు చర్మం తేమగా ఉంటుంది. చర్మ సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. తామర, దురద, సోరియాసిస్ వంటి చర్మ సమస్యలు తగ్గుతాయి. వీటితో పాటు చర్మం ఆరోగ్యంగా ఉండడానికి అవసరమయ్యే పోషకాహారాన్ని తీసుకోవాలి. అలాగే నీటిని ఎక్కువగా తాగాలి. దీంతో చర్మం పొడిబారకుండా చాలా వరకు నిరోధించవచ్చు. అలాగే యోగా, ధ్యానం వంటి వాటిని చేయాలి. ఇవి అంతర్గతంగా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ విధంగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మాయిశ్చరైజర్లు వాడే అవసరం లేకుండా చర్మాన్ని ఆరోగ్యంగా, పొడిబారకుండా ఉంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.