Chicken Roast With Gravy : చికెన్ తో చేసుకునే రుచికరమైన వంటకాల్లో చికెన్ రోస్ట్ కూడా ఒకటి. చికెన్ రోస్ట్ చాలా రుచిగా ఉంటుంది. సైడ్ డిష్ గా తినడానికి చాలా చక్కగా ఉంటుంది. అయితే తరుచూ చికెన్ డ్రై రోస్ట్ కాకుండా మనం చికెన్ వెట్ రోస్ట్ ను కూడా తయారు చేసుకోవచ్చు. అన్నం, చపాతీ, రోటీ, పులావ్ వంటి వాటితో తినడానికి ఈ రోస్ట్ చాలా రుచిగా ఉంటుంది. చికెన్ వెట్ రోస్ట్ ఉంటే చాలు ఇంకా ఏ కూర అవసరం లేదు. ఈ చికెన్ వెట్ రోస్ట్ ను తయారు చేయడం చాలా సులభం. ఎవరైనా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చ. ఎంతో రుచిగా ఉండే ఈ చికెన్ వెట్ రోస్ట్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలన ఇప్పుడు తెలుసుకుందాం.
చికెన్ వెట్ రోస్ట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 3 నుండి 4 టేబుల్ స్పూన్స్, జీడిపప్పు- 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర – ఒక టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ ముక్కలు – ఒక కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, మధ్యస్థంగా కట్ చేసిన చికెన్ – కిలో, తరిగిన పచ్చిమిర్చి – 4, తరిగిన పుదీనా – 2 టేబుల్ స్పూన్స్, తరిగిన కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్స్, టమాటాలు – 2, కారం – 2 టేబుల్ స్పూన్స్, కరివేపాకు – 2 రెమ్మలు.
మసాలా పేస్ట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
ధనియాలు – ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, సోంపు గింజలు – అర టీ స్పూన్, మిరియాలు – ఒక టీ స్పూన్, మెంతులు – పావు టీ స్పూన్, దాల్చిన చెక్క – 2 ఇంచుల ముక్క, లవంగాలు – 6, యాలకులు – 4, అనాస పువ్వు – 1, చిన్న బిర్యానీ ఆకు – 1, గసగసాలు – ఒక టీ స్పూన్, జీడిపప్పు – ఒక టేబుల్ స్పూన్.
చికెన్ వెట్ రోస్ట్ తయారీ విధానం..
ముందుగా జార్ లో మసాలా పేస్ట్ కు కావల్సిన పదార్థాలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత నీళ్లు పోసి పేస్ట్ లాగా చేసుకుని పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత జీడిపప్పు వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత మరో టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. తరువాత జీలకర్ర వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. తరువాత పసుపు, ఉప్పు వేసి కలపాలి. తరువాత చికెన్ వేసి కలపాలి. చికెన్ లోని నీరంతా పోయే వరకు బాగా వేయించాలి.
తరువాత పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా వేసి వేయించాలి. వీటిని రెండు నిమిషాల పాటు వేయించిన తరువాత టమాటాలను పేస్ట్ లాగా చేసి వేసుకోవాలి. తరువాత కారం వేసి కలిపి ముక్కలు మెత్తగా అయ్యే వరకు వేయించాలి. తరువాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసి కలపాలి. దీనిని మరో 5 నిమిషాల పాటు బాగా వేయించిన తరువాత ఒక టేబుల్ స్పూన్ బటర్, కరివేపాకు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ వెట్ రోస్ట్ తయారవుతుంది. ఈ విధంగా తయారు చేసిన చికెన్ వెట్ రోస్ట్ ను దేనితో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది.