Natural Home Remedies For Gout : మనం రోజూ అనేక రకాల ఆహారాలను తింటుంటాం. అలాగే అనేక రకాల పానీయాలను కూడా తాగుతుంటాం. వీటిని తాగడం వల్ల మన శరీరంలో ప్యూరిన్లు అనబడే సమ్మేళనాలు ఏర్పడతాయి. ఈ ప్యూరిన్లు పెద్ద ఎత్తున పేరుకుపోవడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ నిల్వలు పేరుకు పోతాయి. శరీరంలో యూరిక్ యాసిడ్ నిల్వలు పేరుకుపోతే మనకు గౌట్ లేదా కిడ్నీ స్టోన్స్ వస్తాయి. శరీరంలో ఎక్కువగా ఉండే యూరిక్ యాసిడ్ స్పటికాల రూపంలో మారి కీళ్లలో పేరుకుపోతుంది. దీంతో కీళ్లలో తీవ్రమైన అసౌకర్యం ఏర్పడుతుంది. ఫలితంగా కీళ్ల నొప్పులు వస్తాయి.
శరీరంలో యూరిక్ యాసిడ్ నిల్వలు పేరుకుపోయినప్పుడు గౌట్ వస్తుంది. అందువల్ల గౌట్ సమస్యను తగ్గించుకునేందుకు డాక్టర్ వద్దకు వెళ్లి చికిత్స తీసుకోవాలి. దీనికి గాను డాక్టర్లు మందులను ఇస్తారు. అయితే దీర్ఘకాలంగా మందులను వాడడం అంత శ్రేయస్కరం కాదు. గౌట్ ను సహజసిద్ధమైన పద్ధతిలోనే పూర్తిగా నయమయ్యేలా చేసుకోవచ్చు. అందుకుగాను కచ్చితమైన జీవనశైలిని పాటించాలి. మంచి ఆహారపు అలవాట్లను కలిగి ఉండాలి. ముఖ్యంగా ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోరాదు.
పలు చిట్కాలను పాటించాలి..
ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకుంటే శరీరంలో ప్యూరిన్లు ఏర్పడతాయి. కనుక పప్పు దినుసులు, మాంసాహారానికి దూరంగా ఉండాలి. ఈ విధంగా ఆహార నియమాలను పాటించాలి. అలాగే కింద చెప్పిన కొన్ని చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. ఈ చిట్కాలను పాటించడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ నిల్వలను తగ్గించుకోవచ్చు. ఇక ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. శరీరంలో యూరిక్ యాసిడ్ నిల్వలు ఎక్కువగా ఉన్నవారు రోజూ నీళ్లను తగినంత మోతాదులో తాగాల్సి ఉంటుంది.
కొందరు పని ఒత్తిడి కారణంగా నీళ్లను ఎక్కువగా తీసుకోరు. దీని వల్ల కూడా కీళ్లలో స్పటికాలు ఏర్పడతాయి. కనుక నీళ్లను సరైన మోతాదులో తాగాల్సి ఉంటుంది. నీళ్లను తగినంతగా తాగితే గౌట్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలను కూడా తీసుకోవాల్సి ఉంటుంది. వీటివల్ల శరీరంలో పేరుకుపోయే ప్యూరిన్లని ఎప్పటికప్పుడు బయటకు పంపవచ్చు. దీంతో యూరిక్ యాసిడ్ ఏర్పడకుండా ఉంటుంది. ఫలితంగా గౌట్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
విటమిన్ సి పండ్లను తినాలి..
విటమిన్ సి ఎక్కువగా ఉండే నారింజ, నిమ్మ, ద్రాక్ష పండ్లతోపాటు క్యాప్సికం, స్ట్రాబెరీలు, బ్రోకలీ వంటి ఆహారాలను తీసుకుంటున్నా కూడా యూరిక్ యాసిడ్ నిల్వలను తగ్గించుకోవచ్చు. విటమిన్ సి వల్ల మన శరీరంలో ఉండే యూరిక్ యాసిడ్ బయటకు పోతుంది. పసుపును మనం నిత్యం వంటల్లో ఉపయోగిస్తుంటాం. పసుపులో ఆంటి ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. అయితే యూరిక్ యాసిడ్ లెవల్స్‌ను తగ్గించడంలో పసుపు కూడా అద్భుతంగా పనిచేస్తుంది. దీంతోపాటు అల్లాన్ని కూడా ఉపయోగించవచ్చు. యూరిక్ యాసిడ్ నిల్వలను తగ్గించి నొప్పులు, వాపులను తగ్గించడంలో అల్లం కూడా పనిచేస్తుంది. రోజూ అల్లాన్ని ఏదో ఒక విధంగా తీసుకుంటున్నట్లయితే గౌట్ సమస్య నుంచి బయటపడవచ్చు. ఈ విధంగా పలు చిట్కాలను పాటిస్తే గౌట్ నుంచి ఉపశమనం లభిస్తుంది.