Skin Rashes In Summer : వేసవిలో మనలో చాలా మంది వివిధ రకాల చర్మ సమస్యలతో కూడా బాధపడుతూ ఉంటారు. చర్మంపై దురద, దద్దుర్లు, చెమట కాయలు, చర్మం ఎర్రగా మారడం వంటి వివిధ రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఈ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. వేసవిలో ఈ సమస్య రావడం సర్వసాధారణం. అయినప్పటికి వీటి వల్ల కలిగే ఇబ్బంది అంతా ఇంతా కాదు. వేసవికాలంలో ఉండే ఉష్ణోగ్రత కారణంగా చెమట ఎక్కువగా పడుతుంది. దీనికి గాలిలో ఉండే బ్యాక్టీరియా చేరడంతో చర్మంపై దురద, దద్దుర్లు, చెమట కాయలు వంటివి తలెత్తుతాయి. ఈ సమస్య నుండి బయటపడడానికి చాలా మంది చల్లదనాన్ని ఇచ్చే పౌడర్ లను వాడుతూ ఉంటారు. వీటిని వాడడం వల్ల తాత్కాలిక ఉపశమనం మాత్రమే ఉంటుంది. వేసవికాలంలో ఇటువంటి సమస్యలతో బాధపడే వారు ఇప్పుడు చెప్పే చిట్కాలను వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
ఈ చిట్కాలను వాడడం వల్ల చర్మ సమస్యలు తగ్గడంతో పాటు శరీరం కూడా త్వరగా చల్లబడుతుంది. ఈ చిట్కాలు సహజసిద్దమైనవి, వీటిని చాలా సులభంగా ఎవరైనా వాడవచ్చు. వేసవిలో చర్మ సమస్యలను తగ్గించే చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చర్మ సమస్యలతో బాధపడే వారు ముల్తానీ మట్టిని వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మనకు కావల్సినంత ముల్తానీ మట్టిని నీటిలో వేసి ఒక గంట పాటు నానబెట్టాలి. తరువాత నీటిని తీసేసి ఇందులో చందనం పొడి వేసి కలపాలి. తరువాత ఈ మిశ్రమాన్ని అవసరాన్ని బట్టి శరీరంపై, ముఖంపై రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మానికి ఎంతో చల్లదనంగా ఉంటుంది. శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. చర్మంపై పేరుకుపోయిన ట్యాన్ తొలిగిపోతుంది. దద్దుర్లు, చెమటకాయలు, దురద వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. ఇక వేసవికాలంలో చర్మంపై ఎక్కువగా బ్యాక్టీరియా చేరుతుంది. దీంతో దురద వంటి ఇన్పెక్షన్ లు వస్తూ ఉంటాయి.
చర్మంపై చేరిన ఈ బ్యాక్టీరియాను, ఫంగస్ ను తొలగించడం కోసం వీలైనంత వరకు వేప నీటితో స్నానం చేయాలి. వేపాకులు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటాయి. వేప నీటితో స్నానం చేయడంతో పాటు వేప నూనెను చర్మానికి రాసుకోవచ్చు. అలాగే వేప ఆకులను పేస్ట్ గా చేసి చర్మంపై కూడా రాసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఇన్పెక్షన్ లు త్వరగా తగ్గుతాయి. అలాగే ఒక గిన్నెలో వంటసోడాను తీసుకుని అందులో నీళ్లు పోసి పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని దద్దుర్లు ఉన్న చోట చర్మంపై రాసుకోవాలి. కొంత సమయం తరువాత సాధారణ నీటితో చర్మాన్ని శుభ్రం చేసుకోవాలి. రెండు నుండి మూడు రోజుల పాటు ఈ విధంగా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ విధంగా వేసవికాలంలో ఈ చిట్కాలను పాటించడం వల్ల చర్మ సమస్యల నుండి చాలా సులభంగా బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.