Tulasi : మన చుట్టూ అనేక రకాల మొక్కలు ఉంటాయి. ప్రతి మొక్క మనకు ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుంది. అలాగే మనం కొన్ని రకాల మొక్కలను ఎంతో భక్తితో పూజిస్తాం. మొక్కలను పూజించే సాంప్రదాయాన్ని మనం భారతదేశంలో ఎక్కువగా చూడవచ్చు. మనం పూజించే మొక్కల్లో తులసి మొక్క కూడా ఒకటి. హిందువులు ఈ తులసి మొక్కను భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. కేవలం పూజించడానికి మాత్రమే కాకుండా తులసి మొక్క ఆకులను ఆయుర్వేదంలో ఔషధంగా కూడా ఉపయోగిస్తారు.
తులసి మొక్క ఆకులు యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి వాటిని నయం చేయడంలో ఈ ఆకులు ఎంతగానో ఉపయోగపడతాయి. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడానికి మనం కషాయాలను చేసుకుని తాగుతూ ఉంటాం. ఈ కషాయాల తయారీలో కూడా మనం తులసి ఆకులను ఉపయోగిస్తాం. కేవలం జలుబు, దగ్గు వంటి వాటినే కాకుండా మనకు వచ్చే కీళ్ల నొప్పులను, వాత నొప్పులను నయం చేయడంలో కూడా మనకు తులసి మొక్క సహాయపడుతుంది.
తులసి మొక్కల్లో లక్ష్మీ తులసి, కృష్ణ తులసి వంటి రకాలు ఉంటాయని మనందరికీ తెలుసు. ఇవే కాకుండా భూ తులసి అని మరో రకం తులసి మొక్క కూడా ఉంటుంది. ఇది ఎక్కువగా కొండ ప్రాంతాలలో, అటవీ ప్రాంతాలలో ఉంటుంది. ఈ భూ తులసి మొక్కను ఉపయోగించి మనం మన కాళ్ల నొప్పులను తగ్గించుకోవచ్చు. కీళ్ల నొప్పులు, వాత నొప్పులతో బాధపడే వారు ఈ భూ తులసి మొక్క ఆకులను సేకరించి మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని నొప్పి ఉన్న చోట ఉంచి కట్టుకట్టాలి. ఇలా చేస్తూ ఉండడం వల్ల నొప్పులు తగ్గుతాయి.
అదే విధంగా లక్ష్మీ తులసి లేదా కృష్ణ తులసి ఆకులను సేకరించి నీడలో ఎండబెట్టి పొడిగా చేసి నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని 5 గ్రాముల మోతాదులో తీసుకుని దానికి 5 గ్రాముల మిరియాల పొడిని, నెయ్యిని కలిపి రోజుకు రెండు పూటలా సగం సగం తింటూ ఉంటే వాత నొప్పులు తగ్గుతాయి. ఈ విధంగా తులసి మొక్క ఆకులను ఉపయోగించి కీళ్ల నొప్పులను, వాత నొప్పులను తగ్గించుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.