Jamun Leaves : మనం ఆరోగ్యంగా ఉండడానికి అనేక రకాల పండ్లను తింటూ ఉంటాం. మనం ఆహారంగా తీసుకునే పండ్లల్లో నేరేడు పండ్లు కూడా ఒకటి. ఇవి మనందరికీ తెలుసు. కానీ వీటిని తినే వారు ప్రస్తుత కాలంలో తక్కువగా ఉన్నారు. ఇవి సంవత్సరమంతా లభించవు. ఈ నేరేడు పండ్లను తినడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. మన ఆరోగ్యాన్ని కాపాడడంలో నేరేడు పండ్లతో పాటు నేరేడు చెట్టు ఆకులు కూడా మనకు సహాయపడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. నేరేడు చెట్టు ఆకులు కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. వీటిని ఉపయోగించడం వల్ల మనం అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు.
నేరేడు ఆకుల వల్ల కలిగే ఉపయోగాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నేరేడు చెట్టు ఆకులు యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. శరీరం రోగాల బారిన పడకుండా చేయడంలో ఇవి ఎంతగానో దోహదపడతాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఇవి సహాయపడతాయి. పట్టు పురుగులకు ఈ నేరేడు ఆకులను ఆహారంగా ఇస్తారు. ఈ ఆకుల నుండి తీసిన నూనెను పర్ ఫ్యూమ్స్, సబ్బుల తయారీలో ఉపయోగిస్తారు. మలబద్దకాన్ని, అలర్జీలను తగ్గించడంలో కూడా నేరేడు ఆకులు మనకు ఉపయోగపడతాయి. మూత్రపిండాలలో రాళ్ల సమస్యతో బాధపడుతున్న వారు 10 నుండి 15 గ్రాముల నేరేడు ఆకులను తీసుకుని శుభ్రంగా కడిగి వాటికి 4 నల్ల మిరియాలను కలిపి పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ కు తగినన్ని నీళ్లను కలిపి జ్యూస్ గా చేసి రోజుకు రెండు నుండి మూడు సార్లు తాగుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
చిగుళ్ల సమస్యతో బాధపడే వారు నేరేడు ఆకుల రసాన్ని నోట్లో పోసుకుని పుక్కిలించి ఉమ్మివేయాలి. ఇలా చేస్తూ ఉండడం వల్ల చిగుళ్ల సమస్యలు తగ్గిపోతాయి. నేరేడు ఆకుల రసంలో తేనెను కలిపి తాగడం వల్ల అరి కాళ్ల, అరి చేతుల మంటలు తగ్గుతాయి. శరీరం క్యాన్సర్ బారిన పడకుండా చేయడంలో కూడా నేరేడు ఆకులు ఉపయోగపడతాయి. పొట్టలో వచ్చే అల్సర్లను తగ్గించే గుణం కూడా ఈ నేరేడు ఆకులకు ఉంది. కేవలం నేరేడు పండ్లు, ఆకులే కాకుండా నేరేడు చెట్టు బెరడు, గింజలు, వేర్లు కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. వీటిని ఆయుర్వేదంలో అనేక రకాల అనారోగ్య సమస్యలను నయం చేయడంలో ఔషధంగా ఉపయోగిస్తారు.
మొలలను తగ్గించడంలో కూడా నేరేడు ఆకులు మనకు ఎంతో సహాయపడతాయి. నేరేడు ఆకులను కొత్తిమీర లేదా పుదీనా వంటి వాటితో కలిపి జ్యూస్ గా చేసుకుని వారం పాటు తాగాలి. ఇలా చేయడం వల్ల మొలల నుండి రక్తం కారడం ఆగడంతోపాటు నొప్పి కూడా తగ్గుతుంది. అంతేకాకుండా నేరేడు చెట్టు చిగుర్లతో కషాయాన్ని కాచి దానిని రోజుకు 2 పూటలా 3 నుండి 4 టేబుల్ స్పూన్ల మోతాదులో తీసుకుంటూ ఉంటే కూడా మొలలు తగ్గుతాయి. ఈ కషాయాన్ని తాగడం వల్ల కడుపులో నులి పురుగులు నశిస్తాయి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అతిదాహం సమస్య కూడా నయం అవుతుంది. నేరేడు చెట్టు ఆకులతో చేసిన కషాయాన్ని తాగడం వల్ల నీళ్ల విరేచనాలు తగ్గుతాయి.
అధిక జ్వరంతో బాధపడే వారు నేరేడు ఆకుల జ్యూస్ ను తాగడం వల్ల జ్వరం వెంటనే తగ్గుతుంది లేదా ఈ ఆకులను నీటిలో వేసి మరిగించి వడకట్టాలి. ఈ నీటిని తాగడం వల్ల కూడా జ్వరం తగ్గుతుంది. నేరేడు ఆకుల జ్యూస్ ను తాగడం వల్ల శరీరంలో రక్తప్రసరణ వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. ఈ విధంగా నేరేడు ఆకులు మనకుఎంతగానో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. నేరేడు పండ్లు మనకు సంవత్సరమంతా లభించక పోయినా నేరేడు ఆకులు మనకు ఎప్పుడూ లభిస్తాయి. కనకు వీటిని ఉపయోగించి మనం అనేక రోగాలను నయం చేసుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.