Vehicle Fuel : వాహనాలన్నాక వాటిల్లో పెట్రోల్, డీజిల్ లేదా సీఎన్‌జీ లలో ఏదో ఒకటి నింపాల్సిందే. ఎందుకంటే ఇంధనం లేనిదే ఏ వాహనం నడవదు కదా. అయితే చాలా మంది ఫ్యుయల్ చివరి పాయింట్ వచ్చే వరకు నడుపుతుంటారు. బైక్‌లలో అయితే రిజర్వ్ లో పడి చాలా దూరం వెళ్లినా.. కార్ల వంటి 4 వీలర్స్‌లో అయితే ఎరుపు రంగు ఫ్యుయల్ ఇండికేటర్ లైన్ దాటి కిందకు మార్క్ వెళ్లినా ఆగకుండా వెళ్తారు. ఆ.. ఇంకాస్త దూరం వెళ్లాక ఫ్యుయల్ కొట్టిద్దాంలే అని అనుకుంటారు. అయితే నిజానికి ఫ్యుయల్ అయిపోతుందంటే అప్పుడు కాకపోయినా కొంత దూరం వెళ్లాకయిన కొట్టించాల్సిందే కదా. కానీ కొందరు అలా చేయరు, ఆలస్యం చేస్తారు.
చివరకు ఫ్యుయల్ కాస్తా అయిపోయాక వాహనాన్ని తోస్తూ పెట్రోల్ పంప్ కోసం చూస్తారు. అయితే సరే.. అలా తోసినా ఫరవాలేదు కానీ, నిజానికి ఫ్యుయల్ అయిపోయే దాకా అలా వాహనాన్ని ఉంచకూడదు. ఫ్యుయల్ పూర్తిగా అయిపోయేలా వాహనాన్ని నడపకూడదు. అలా నడిపితే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. వాహనాన్ని ఫ్యుయల్ పూర్తిగా అయిపోయే వరకు నడిపితే ఫ్యుయల్ అయిపోయాక ఆ పైపుల్లో గాలి ఏర్పడుతుంది. అది ఇంజిన్‌పై ప్రభావం చూపుతుంది. దీంతో ఇంజిన్ బాగా వేడెక్కి దాని పనితీరుపై ప్రభావం చూపుతుంది. ఆ క్రమంలో ఇంజన్ పాడైపోయేందుకు అవకాశం ఉంటుంది. దీంతో ఇంజిన్ రిపేర్ కోసం బాగా ఖర్చు చేయాల్సి వస్తుంది. కనుక ఎప్పుడైనా ఫ్యుయల్ అయిపోయే వరకు వేచి చూడకుండా ముందే వాహనాన్ని రీఫిల్ చేయడం బెటర్.
కార్లు అయితే ఫ్యుయల్ మీటర్‌లో ఎరుపు రంగు ఇండికేటర్ లైన్ మార్కు దాటకుండా చూసుకోవాలి. ఆ మార్కు దాటకముందే ఫ్యుయల్ రీఫిల్ చేయాలి. ఇక బైక్‌లు అయితే రిజర్వ్‌లో పడగానే వీలైనంత త్వరగా ఫ్యుయల్ రీఫిల్ చేయాలి. అంతేకానీ, రిజర్వ్ లో ఉంది కదా, ఇంకా చాలా సేపు వెళ్లవచ్చులే అని మాత్రం అనుకోకూడదు. ఎందుకంటే నిజానికి కారులో లేదా బైక్‌లో లేదా ఇతర వాహనంలో అయినా ఉండే ఫ్యుయల్ మీటర్లు ఎల్లప్పుడూ కచ్చితత్వంతో పనిచేయవు. ఒక్కోసారి చెడిపోయేందుకు అవకాశం ఉంటుంది. కనుక వాటిని నమ్మరాదు. ఈ క్రమంలో ఫ్యుయల్ ను ఎప్పటికప్పుడు ఫిల్ చేసుకుంటే దాంతో ఇంజిన్ కూడా చెడిపోదు. అనవసరంగా డబ్బులు వెచ్చించాల్సిన పనిరాదు.
ఇక ప్రస్తుతం వస్తున్న టూవీలర్స్ బీఎస్-6 వాహనాలు కనుక రిజర్వ్ అనే ఆప్షన్ ఉండడం లేదు. కానీ ఫ్యుయల్ రీడింగ్‌లో ఒకటి లేదా రెండు పాయింట్లు ఉండగానే పెట్రోల్ కొట్టించడం మేలు. లేదంటే అది ఎప్పుడు అయిపోతుందో తెలియదు. దీంతో సమస్యల పాలు కావల్సి వస్తుంది. అలాగే ఇంజిన్‌పై కూడా ప్రభావం పడుతుంది. కనుక వాహనాల్లో పూర్తిగా ఇంధనం అయిపోక ముందే కాస్త ఉండగానే ఇంధనాన్ని నింపించుకోవాలి. దీంతో వాహనం మైలేజీ చక్కగా ఇవ్వడమే కాదు.. ఇంజిన్ లైఫ్ కూడా ఎక్కువగా వస్తుంది. అలాగే ఇతర సమస్యలు రాకుండా ఉంటాయి. కనుక వాహనాల్లో ఫ్యుయల్‌ను ఎప్పటికప్పుడు కొట్టించండి. మరిచిపోవద్దు.