పూర్వం ఒకానొకప్పుడు ఒక బాలుడు ఉండేవాడు. అతని పేరు హార్లాండ్. తన తల్లిదండ్రులకు హార్లండ్ మొదటి సంతానం కావడంతో అతనిపై వారు ఎన్నో ఆశలను పెంచుకున్నారు. కానీ అప్పటికి వారికి తెలియదు, అతని జీవితం ఎవరూ ఊహించని విధంగా మారబోతుందని. హార్లండ్‌కు 5 సంవత్సరాల వయస్సు రాగానే తండ్రిని కోల్పోయాడు. 17 సంవత్సరాల వయస్సు వచ్చే సరికే స్కూల్ డ్రాపౌట్‌గా మిగిలిపోయాడు. అప్పటికే తాను చేస్తున్న 4 ఉద్యోగాలను కూడా కోల్పోయాడు. హార్లండ్‌కు 19 సంవత్సరాలు వచ్చాయి. అప్పటికే ముగ్గురికి తండ్రి అయ్యాడు. వారిలో తన చిన్నారి కొడుకును కోల్పోయాడు. ఇద్దరు కూతుళ్లు మిగిలారు. వారిని తీసుకుని హార్లండ్ భార్య అతన్ని విడిచి పెట్టి వెళ్లిపోయింది.
22 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు ఓ భవన నిర్మాణ సంస్థలో కార్మికుడిగా చేరాడు. కొద్ది రోజులకే ఆ ఉద్యోగాన్ని కూడా కోల్పోయాడు. ఆర్మీలోనూ, లాయర్‌గా కూడా హార్లండ్ ఫెయిల్ అయ్యాడు. 34 ఏళ్లు వచ్చే సరికి ఓ కొత్త వెంచర్‌ను ప్రారంభించాడు. కానీ అది పీకల్లోతు నష్టాలను మిగిల్చింది. 40 ఏళ్ల వయస్సులో ఓ ఫుడ్ స్టోర్‌లో చికెన్ సర్వీస్ చేసే సర్వెంట్‌లా ఉద్యోగం చేయడం ప్రారంభించాడు. 50 సంవత్సరాల వయస్సులో సొంతంగా ఓ రెస్టారెంట్‌ను ప్రారంభించాడు. కానీ అది కాస్తా అగ్ని ప్రమాదంలో కాలి బూడిదైంది. అయినా హార్లండ్ దిగులు చెందలేదు. ఆ రెస్టారెంట్‌ను బాగు చేయించి మళ్లీ ఓపెన్ చేశాడు. 62 ఏళ్ల వయస్సులో కొత్తగా ఓ కంపెనీని ఏర్పాటు చేశాడు. దాని పేరే కెంటకీ ఫ్రైడ్ చికెన్. షార్ట్ ఫాంలో చెప్పాలంటే ఆ కంపెనీ పేరు కేఎఫ్‌సీ (KFC). ప్రస్తుతం ఆ కంపెనీ మార్కెట్ విలువ దాదాపుగా 9 బిలియన్ అమెరికన్ డాలర్లు.
పైన చెప్పిందంతా యదార్థ గాథే. అది కేఎఫ్‌సీ యజమాని హార్లండ్ శాండర్స్ (Harland Sanders) నిజమైన జీవిత గాథ. అవును, జీవితమంతా దాదాపుగా అయిపోయింది అనుకున్న ఆఖరి క్షణంలోనూ హార్లండ్ ఆత్మవిశ్వాసాన్ని సడలలేదు. పట్టుదలతో శ్రమించాడు. కేఎఫ్‌సీ కంపెనీ పెట్టాడు. ఇప్పుడది బిలియన్ డాలర్ల కంపెనీగా అవతరించింది. 62 ఏళ్ల వయస్సులో హార్లండ్ ఈ కంపెనీని ఏర్పాటు చేయడం విశేషమైతే అంత లేట్ అయినా లేటెస్ట్‌గా హార్లండ్ తన అభివృద్ధికి బాటలు వేసుకున్నాడు. హార్లండ్ కథను బట్టి మనకు తెలుస్తుందేమిటంటే మన శరీరంలో చివరి శ్వాస ఉన్నంత వరకు విజయం కోసం పోరాటం చేస్తూనే ఉండాలి. ఏమో ఆఖరి క్షణంలోనైనా విజయం దక్కుతుందేమో! అలా దక్కినా విజయగర్వంతో తుది శ్వాస విడవచ్చు కదా! విజయం ఇచ్చే ఆనందం, ఆత్మ సంతృప్తి అటువంటిది మరి.
మీకు ఏం జరుగుతుందో అదే జీవితం కాదు, మీకు జరిగే దాన్నుంచి ఏం నేర్చుకున్నావనేదే జీవితం, మిమ్మల్ని అడ్డుకుంటోంది ఏదో గుర్తించండి, దాన్నుంచి దూరంగా జరగండి. విజయం మీ సొంతమవుతుంది. ఇదే హార్లండ్ పాటించిన సూత్రం. ఎవరో ఒకరికి, ఆ మాటకొస్తే అందరికీ ఈ సూత్రం బాగా పనికొస్తుందనే ఉద్దేశంతో హార్లండ్ కథను ఇవ్వడం జరిగింది. ఇష్టమైతే ఇదే సూత్రంతో ముందుకు దూసుకెళ్లండి!