18వ శతాబ్దం, కేరళ, త్రివాంకూర్ రాజ్యం. అప్పుడు సమాజంలో కులవ్యవస్థ చాలా దారుణంగా ఉంది. బ్రాహ్మణులు మరియు ఉన్నతకులాల వారు అన్ని రకాల ప్రత్యేక హక్కులను అనుభవిస్తున్నప్పుడు, తక్కువ కులాల వారు గౌరవం, ఆస్తి, స్వేచ్ఛల నుండి పూర్తిగా వంచించబడ్డారు. ఆ అణచివేతలో అత్యంత క్రూరమైన విధానం మూలక్కారం (బ్రెస్ట్ టాక్స్). ఈ చట్టం ప్రకారం, తక్కువ కులానికి చెందిన మహిళలు తమ ఛాతిని కప్పుకోవాలంటే పన్ను చెల్లించాల్సి వచ్చేది. ఇది ఆ మహిళలకు అపారమైన అవమానంగా నిలిచింది. మహిళ శరీరానికి కూడా పన్ను విధించడం ఆ రాజ్యంలోని సామాజిక అన్యాయాన్ని ప్రదర్శించింది. ఈ క్రూరమైన పరిస్థితుల్లో నాంగేలి అనే ధైర్యవంతమైన మహిళ త్రివాంకూర్‌లో జన్మించింది. ఆమె ఒక తక్కువ కులానికి చెందినది, కానీ తెలివైనది.
నాంగేలి కుటుంబం పేదరికంలో మునిగిపోయి వ్యవసాయంపై ఆధారపడేది. అయినా, సామాజిక ఒత్తిడితో పాటు పన్నుల భారం వారిని మరింత బాధించింది. కానీ, నాంగేలి తన గౌరవాన్ని ఏ మాత్రం వదులుకోలేదు. ఒక రోజు పన్ను వసూలు చేసే అధికారులు నాంగేలి ఇంటికి వచ్చారు. బ్రెస్ట్ టాక్స్ కట్టాలని బలవంతపరిచారు. అది ఆమె మనసుకు బలమైన గాయాన్ని చేసింది. ఆమె దీనిని అంగీకరించడానికి నిరాకరించింది. అధికారులు బెదిరించారు – పన్ను చెల్లించకపోతే శిక్ష పడుతుందని హెచ్చరించారు. కానీ, నాంగేలి భయపడలేదు. తన గౌరవాన్ని కాపాడుకునేందుకు ఒక విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకుంది. ఆమె తన ఇంట్లోకి వెళ్లి ఒక పదునైన కత్తి తీసుకొని, తన స్వంత చేత్తో తన రెండు స్తనాలను కోసుకొని అధికారుల ముందుకు విసిరేసింది. ఆమె శరీరంలో రక్తం ఉప్పొంగి పొయ్యింది. ఆమె గట్టిగా చెప్పింది – నా శరీరం మీద పన్ను వేస్తారా? అయితే ఈ శరీరాన్నే తీసుకోండి!.. అన్నది.
ఈ ఘోరమైన సంఘటన చూసి అధికారులు భయంతో వెనక్కి తగ్గారు. నాంగేలి తన ప్రాణాలను కోల్పోయింది. ఆమె భర్త ఆమె మరణాన్ని తట్టుకోలేక నేరుగా ఆ జ్వలించుతున్న చితిలో దూకి ప్రాణత్యాగం చేశాడు. ఈ ఘటన త్రివాంకూర్ రాజ్యమంతా వ్యాపించి, నాంగేలి నిడివార్తగా మారింది. ఆమె ధైర్యం, త్యాగం మహిళల హక్కుల కోసం ఒక చిహ్నంగా నిలిచింది. ఆమె నివసించిన ఊరు మూలచ్చి పార (అంటే, బ్రెస్ట్ కటింగ్ రాక్) అని పిలవబడింది. నాంగేలి త్యాగం వృధా కాలేదు. కేరళలో జరిగిన విప్లవ ప్రభావంతో బ్రెస్ట్ టాక్స్ రద్దయింది. ఈ కథ మనకు నేర్పే విషయం – ఒక మహిళ కూడా సమాజంలోని అన్యాయాలను ఎదిరించి పోరాడగలదు. నాంగేలి తన గౌరవం కోసం ప్రాణత్యాగం చేసి, అన్యాయాన్ని ధిక్కరించి, చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది.