జామ పండ్లను పేదోడి యాపిల్ అంటారు. ఇవి ధర తక్కువగా ఉంటాయి. అందుకనే వీటిని అలా పిలుస్తారు. యాపిల్ పండ్లకు దీటుగా జామ పండ్లలో పోషకాలు ఉంటాయి. ఇవి గ్రామీణ ప్రాంతాల్లో మనకు చాలా ఎక్కువగా లభిస్తాయి. చాలా మంది ఇండ్లలోనే జామ చెట్లను పెంచుతారు. కనుక డబ్బులు ఖర్చు చేయకుండానే వీటిని మనం గ్రామీణ ప్రాంతాల్లో పొందేందుకు వీలు కలుగుతుంది. జామ పండ్లకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
* ప్రపంచవ్యాప్తంగా జామ పండ్లలో 150కి పైగా వెరైటీలు ఉన్నాయి. మనం తెలుపు, పింక్ రంగులో గుజ్జు ఉండే జామ పండ్లనే చూశాం. కానీ ఆకుపచ్చ, పసుపు రంగుల్లోనూ గుజ్జు ఉండే జామ పండ్లు కూడా ఉన్నాయి.
* జామ ఆకులను ఆయుర్వేదంలో, సంప్రదాయ వైద్య విధానాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. జామ ఆకులను బాగా నలిపి గాయాలపై, పుండ్లపై రాస్తే అవి త్వరగా మానుతాయి. జామ ఆకులను నీటిలో బాగా మరిగించి ఆ మిశ్రమాన్ని సేవిస్తే దగ్గు, గొంతు సమస్యలు, ఛాతి సమస్యలు, నోటి అల్సర్, చిగుళ్ల వాపు, వాంతులు, విరేచనాలు వంటి సమస్యల నుంచి తక్షణమే ఉపశమనం లభిస్తుంది.
* జామ పండ్లను ఆంగ్లంలో guava అని పిలుస్తారు. ఈ పదం దక్షిణ అమెరికాలోని అరావక్ అనే భాష నుంచి పుట్టుకువచ్చింది. ఆ భాషలోని guayabo అనే పదం నుంచి guava అనే పదం ఉద్భవించింది.
* జామ పండ్లతో శీతలపానీయాలు, జామ్‌లు, ఇతర ప్యాక్డ్ ఆహారాలను తయారు చేస్తారు.
* నారింజ పండు కన్నా 4 రెట్లు ఎక్కువగా విటమిన్ సి జామ పండ్లలో ఉంటుంది. అలాగే పైనాపిల్ కన్నా 4 రెట్లు ఎక్కువగా ఫైబర్ (పీచు పదార్థం) జామ పండ్లలో ఉంటుంది. టమాటాల కన్నా 2 రెట్లు ఎక్కువ లైకోపీన్ ఈ పండ్లలో ఉంటుంది. లైకోపీన్ శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే అరటి పండ్ల కన్నా ఎక్కువ పొటాషియం జామ పండ్లలో ఉంటుంది. దీంతో గుండెకు సంరక్షణ లభిస్తుంది. దీంతోపాటు బి విటమిన్లు, విటమిన్ ఎ, ఇ, మినరల్స్, ఫైటోకెమికల్స్ జామ పండ్లలో ఉంటాయి.
* జామ చెట్టు ఎలా పుట్టింది అనే విషయంపై ఫిలిప్పీన్స్‌లో ఒక కథ కూడా ప్రచారంలో ఉంది. అప్పట్లో Barabas అనబడే ఒక రాజు వద్దకు ఓ వృద్ధురాలు వచ్చి ఆహారం కావాలని ప్రాధేయపడింది. కానీ ఆ రాజు పొమ్మన్నాడు. దీంతో ఆ వృద్ధురాలు ఆ రాజుకు శాపం పెట్టింది. ఈ క్రమంలో ఆ రాజు అనారోగ్యం బారిన పడి చనిపోయాడు. తరువాత అతని సమాధిపై వింతైన చెట్టు మొలిచింది. దాన్ని అప్పట్లో స్థానికులు Bayabas అని పిలిచారు. అంటే ఫిలిప్పీన్స్ భాషలో guava అని అర్థం వస్తుంది. అంటే జామ పండు అని అర్థం అన్నమాట.