కాలిఫ్లవర్ ఏ రంగులో ఉంటుంది ? తెలుపు.. కదా.. మార్కెట్‌లోనే కాదు, మనం ఎక్కడ చూసినా సహజంగానే కాలిఫ్లవర్ తెలుపు రంగులో మనకు భలే ఆకర్షణీయంగా దర్శనమిస్తుంది. అయితే మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన ఓ రైతు మాత్రం పసుపు రంగు, వంకాయ కలర్‌లో ఉండే కాలిఫ్లవర్‌ను పండిస్తున్నాడు. అవి సాధారణ కాలిఫ్లవర్ కన్నా ధర ఎక్కువగా ఉండడమే కాదు, వాటిల్లో పోషకాలు కూడా అధికంగా ఉంటాయని సైంటిస్టులు చెబుతున్నారు.
మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతం మలెగావ్ తాలూకా దభది గ్రామానికి చెందిన 42 ఏళ్ల మహీంద్రా నికమ్ 70 రోజుల కిందట పసుపు, వంకాయ రంగు కాలిఫ్లవర్ పంటలను తన 30 గుంటల పొలంలో వేశాడు. పంట దిగుబడి బాగానే వచ్చింది. కాగా ఈ రకం కాలిఫ్లవర్ విత్తనాలను సింజెంటా ఇండియా లిమిటెడ్ అనే పూణెకు చెందిన కంపెనీ అభివృద్ది చేయగా వీటిని మహీంద్రా.. హర్యానాలోని కర్నాల్ అనే వ్యవసాయ క్షేత్రం నుంచి కొనుగోలు చేశాడు. అనంతరం ఆ విత్తనాలతో పంట వేయగా.. దిగుబడి బాగా వచ్చింది.
ఇక విత్తనాలకు, పంట వేసేందుకు అతనికి రూ.2 లక్షల వరకు పెట్టుబడి అయింది. కేవలం విత్తనాలకే అతను రూ.40వేలు చెల్లించాడు. ఈ క్రమంలో ప్రస్తుతం అతని పొలంలో 20వేల కిలోల పసుపు, వంకాయ రంగు కాలిఫ్లవర్‌లు పండాయి. కాగా వాటి ధర కేజీకి రూ.80గా ఉంది. దీంతో అతనికి రూ.16 లక్షల ఆదాయం రానుంది.
కాగా సాధారణ కాలిఫ్లవర్‌తో పోలిస్తే ఈ రంగు కాలిఫ్లవర్‌లలో ఆంథోసయనిన్స్ అనబడే సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే యాంటీ బాక్టీరియల్, యాంటీ క్యాన్సర్ గుణాలు కూడా ఎక్కువే. విటమిన్ ఎ కూడా ఎక్కువగానే ఉంటుంది. నగరాల్లో ప్రస్తుతం ఈ తరహా కాలిఫ్లవర్‌లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. అందుకనే వీటిని పండించానని అతను తెలిపాడు. అయితే సదరు కర్నాల్ ఫామ్‌కు చెందిన శిరీష్ షిండే మాట్లాడుతూ రైతులకు కావల్సిన ఈ తరహా కాలిఫ్లవర్ విత్తనాలు ప్రస్తుతం కావల్సినన్ని అందుబాటులో ఉంటాయని తెలిపాడు. అందువల్ల ఆసక్తి ఉన్నవారు హర్యానాలోని కర్నాల్ ఫామ్‌ను సంప్రదించవచ్చు.