అక్బర్, బీర్బల్ గురించి తెలియని వారుండరంటే అతిశయోక్తి లేదు. చిన్న పిల్లలు మొదలు కొని పెద్దల వరకు అందరికీ వీరి గురించి తెలుసు. అక్బర్ పాలనలో బీర్బల్ తన తెలివితో ఎన్నో క్లిష్టతరమైన సమస్యలను పరిష్కరించాడు కూడా. అందుకు అక్బర్ బీర్బల్‌ను ఎన్నోసార్లు మెచ్చుకోవడం, అందుకు తగిన బహుమతిని అతనికి ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు చెప్పబోయేది కూడా అలాంటి ఓ సంఘటన గురించే. మరి అక్బర్ బీర్బల్‌ను ఏం అడిగాడో, బీర్బల్ అందుకు ఏమని సమాధానమిచ్చాడో ఇప్పుడు తెలుసుకుందామా.
ఒకానొక రోజు అక్బర్‌కు చాలా విచిత్రమైన సందేహాలు వచ్చాయి. సందేహాలు అనేకంటే వాటిని ప్రశ్నలు అనడమే ఉత్తమం. ఆ ప్రశ్నలు అక్బర్‌కు తలెత్తిన వెంటనే వాటిని నివృత్తి చేసుకోవాలని అనిపించింది. వెంటనే బీర్బల్‌ను పిలిపించాడు. అవే ప్రశ్నలను అతనికి సంధించాడు. అవేమిటంటే.. 1. దేవుడు ఎక్కడుంటాడు ? 2. అతని పని ఏమిటి ? 3. అతను ఏం తింటాడు ? ఆ ప్రశ్నలను విన్న బీర్బల్‌కు మొదట ఆశ్చర్యం వేసింది. అయినా చక్రవర్తి అడుగుతున్నాడు కదా. సమాధానం చెప్పాలని అతని ముందుకు వెళ్లి ఇలా అన్నాడు.
దేవుడు అన్ని చోట్లా ఉంటాడు. అతను ఉండని ప్రదేశం లేదు. భక్తులకు ఆయన తమ తమ హృదయాల్లో దర్శనమిస్తాడు. ప్రేమ, దయ, జాలి ఎక్కడ ఉంటుందో ఆయన అక్కడే ఉంటాడు. ఈర్ష్య, అసూయ, ద్వేషం వంటి వాటిని మనుషుల నుంచి తరిమికొడుతూ వారిని మంచి వారిగా మార్చడమే ఆయన పని. నిత్యం ఆ పనిలోనే ఆయన ఉంటాడు. మనుషుల్లో మార్పు తెస్తుంటాడు. మనుషుల్లో ఉన్న అహంకారాన్ని దేవుడు తినేస్తాడు. అదే ఆయనకు ఆహారం. దాన్ని తిని మనుషులను మంచి వారిగా మారుస్తాడు. ఇలా బీర్బల్ చెప్పిన సమాధానాలకు అక్బర్ సంతృప్తి చెంది అతన్ని బహుమతులతో సత్కరిస్తాడు.