జిహ్వకో రుచి అన్న చందంగా ప్రతి మనిషికి ఆహారం విషయంలో ఒక టేస్ట్ అంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే కొందరు ఒక వంటకం అంటే ఇష్టపడితే, మరికొందరు ఇంకో వంటపై ఆసక్తి చూపిస్తారు. అయితే కొన్ని ఆహార పదార్థాలను మాత్రం దాదాపుగా అందరూ ఇష్టపడతారు. అలాంటి వాటిలో సమోసా కూడా ఒకటి. దీన్ని మన భారతీయులు అందరూ ఇష్టంగానే తింటారు. కానీ మీకు తెలుసా? ఇది ఓ దేశంలో నిషేధించబడిందని? అవును, మీరు విన్నది నిజమే. అయితే కేవలం సమోసా మాత్రమే కాదు, భారతీయులు ఎంతో ఇష్టంగా సేవించే అలాంటి కొన్ని ఆహార పదార్థాలను కొన్ని దేశాల్లో నిషేధించారట. ఎందుకో తెలుసుకుందాం పదండి.
సోమాలియా దేశంలో సమోసాలపై నిషేధం ఉంది. ఎందుకంటే సమోసాలు త్రికోణాకారంలో ఉంటూ క్రిస్టియన్ మతాన్ని సూచిస్తాయనే ఉద్దేశంతో సోమాలియాలో సమోసాలను నిషేధించారట. ఫ్రాన్స్‌లోని పాఠశాలల్లో టమాటా కెచప్‌ను వాడడంపై నిషేధం ఉంది. అక్కడి ప్రజలు టమాటా కెచప్‌ను తమ సాంప్రదాయాలకు, విశ్వాసాలకు వ్యతిరేకమైందిగా భావిస్తారు. మన దగ్గర చిన్నారులు ఎంతో ఇష్టంతో తినే కిండర్ జాయ్ తెలుసుగా! ప్లాస్టిక్ లాంటి చిన్నపాటి బౌల్‌లో చాక్లెట్ ఉంటుంది. అయితే దీన్ని అమెరికాలో నిషేధించారట. ఎందుకంటే ప్లాస్టిక్‌ను కూడా తినే వస్తువనుకుని చిన్నారులు దాన్ని మొత్తం మింగేస్తారనే భయంతో దానిపై నిషేధం విధించారట.
సింగపూర్‌లో చూయింగ్ గమ్‌లు వాడడంపై నిషేధం ఉంది. ఒక వేళ ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే వారికి రూ.32వేల దాకా ఫైన్ పడుతుంది. కాలిఫోర్నియాలో పచ్చి బాదం పప్పును అమ్మడం నిషేధించారు. ఎందుకంటే పచ్చి బాదం పప్పు వల్ల సాల్మొనెల్లా అనే పేరున్న ఓ బాక్టీరియా శరీరంలోకి ప్రవేశిస్తుందని అక్కడి వారి నమ్మకం. అయితే ఉడకబెట్టిన, రోస్ట్ చేసిన బాదం పప్పును మాత్రం విక్రయించవచ్చు. మౌంటెన్ డ్యూ కూల్ డ్రింక్‌ను దాదాపు 100 దేశాల్లో నిషేధించారు. ఎందుకంటే అందులో బ్రొమినేటెడ్ వెజిటబుల్ ఆయిల్ కలుస్తుందట. దీంతో జ్ఞాపకశక్తి తగ్గుదల, అలసట వంటి అనారోగ్యాలు వస్తాయట.
పచ్చి పాలను అమ్మడాన్ని అమెరికా, కెనడాలలో నిషేధించారు. పైన చెప్పిన సాల్మొనెల్లా అనే బాక్టీరియాయే దీనికీ కారణం. జెల్లీ రూపంలో ఉండే స్వీట్లు అమ్మడం యూకే, యురోపియన్ దేశాల్లో నిషిద్ధం. ఎందుకంటే వాటిలో కోన్‌జాక్ అని పిలవబడే ఓ కెమికల్ కలుపుతారట. అందువల్ల అది పిల్లలకు అనారోగ్యాన్ని కలిగిస్తుందట. అందుకే జెల్లీ స్వీట్లను ఆయా దేశాల్లో నిషేధించారు. హోలీ సమయంలో ఉత్తర భారతదేశస్తులు ఎక్కువగా తాగే భంగును దాదాపు అన్ని దేశాలు నిషేధించాయట. ఎందుకంటే అందులో కాన్నాబిస్ అని పిలవబడే ఓ రకమైన రసాయనం పెద్ద ఎత్తున కలుస్తుందట. అది మన శరీరానికి హాని కలిగిస్తుందట.