Dreams : నిద్రపోతే చాలు, మనలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక కల వస్తుంటుంది. అయితే కలలను గురించి అధ్యయనం చేసే నిపుణులు ఏం చెబుతున్నారంటే ప్రతి మనిషి రాత్రి పూట నిద్రించే సమయంలో దాదాపు 4 నుంచి 5 వరకు భిన్నమైన కలలను కంటాడట. ఒక్కో కల 15 నుంచి 40 నిమిషాల పాటు ఉంటుందట. అయితే వీటిలో అధిక శాతం వరకు అనేక మందికి గుర్తుండవు. కేవలం కొద్ది మందికి మాత్రమే అవి గుర్తుంటాయి. కానీ కొన్ని రకాల కలలు మాత్రం మనలో అధిక శాతం మందికి సాధారణంగా తరచూ వస్తూనే ఉంటాయి. నిపుణలు చెబుతున్న ప్రకారం వ్యక్తుల ప్రవర్తనను బట్టి వారికి కలలు వస్తాయట. వారి వ్యక్తిత్వం, నడవడిక ఇత్యాది అంశాల మేళవింపుతో కూడినవై కలలు ఉంటాయి.
అయితే ఇదే సమయంలో కలలు కొన్ని విషయాలను కూడా మనకు చెబుతుంటాయి. మనం భయపడుతున్న, నిర్లక్ష్యంగా వదిలేస్తున్న విషయాలను ప్రతిబింబించే విధంగా కలలు వస్తాయి. అసలు మనకు సాధారణంగా తరచూ వచ్చే కలలు ఏమిటి..? వాటి గురించిన విశేషాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఏదైనా ఎత్తయిన భవంతి నుంచి లేదా లోయ వంటి ప్రదేశంలోకి పడి పోతున్నట్టుగా కల వస్తే మీరు జీవితంలో ఏదో ఒక పెద్ద సమస్యను ఎదుర్కొంటున్నట్టు భావించాలి. ఈ సమస్య పని, సంబంధ బాంధవ్యాలు, లేదా ఇతర వేరే ఏ విషయానికి సంబంధించిందైనా అయి ఉండవచ్చు. స్కూల్, కాలేజ్ లేదా ఆఫీస్ వంటి ప్రదేశాల్లో అందరికీ మీరు నగ్నంగా కనిపిస్తున్నట్టు కల వస్తే అది మీకు ఉన్న తొందర, ఆతృతను తెలియజేస్తుంది. సాధారణంగా కొత్త ప్రదేశంలోకి వెళ్లబోతున్న వారికి, ప్రమోషన్ వచ్చిన ఉద్యోగులకు, కొత్త ఉద్యోగులకు ఇలాంటి కలలు వస్తాయి.
ఏదైనా పరీక్ష రాస్తున్నట్టు కల వస్తే అది మీరు ఒత్తిడికి గురవుతున్నారని సూచిస్తుంది. సాధారణంగా స్కూల్‌లో చదివే విద్యార్థులకు, ఆఫీస్‌లలో ఎక్కువగా పనిచేసే ఉద్యోగులకు ఇలాంటి కలలు వస్తాయి. ఇవి మీరు ఒత్తిడికి లోనవుతుండడాన్ని సూచిస్తాయి. ఎవరైనా సెలబ్రిటీని కలిసినట్టు కల వస్తే మీలో ఉన్న నైపుణ్యాలు బహిర్గతమవుతున్నట్టు భావించాలి. మంచి పేరు, గుర్తింపు కోసం మీరు ప్రయత్నిస్తున్నారని అర్థం చేసుకోవాలి. ఈ కల అసలు రాకూడదంటారు. అదేనండీ చనిపోతున్నట్టు వచ్చే కల. ఇలా వస్తే మీరు మీ జీవితంలో ఏదైనా సంబంధం, ఉద్యోగం లేదా వేరే ఏదైనా విషయానికి శాశ్వతంగా ముగింపు పలకాలని భావిస్తున్నట్టు అర్థం. కొత్త జీవితం కోసం ఆరాటపడుతున్న వారికి కూడా ఇలాంటి కలలు వస్తాయి. అయితే కొన్ని వర్గాల్లో మాత్రం చనిపోతున్నట్టు కల వస్తే మంచిదేనని, అది ఆ వ్యక్తికి దీర్ఘాయువునిస్తుందని నమ్ముతారు.
ఎవరైనా మిమ్మల్ని వెంటాడుతున్నట్టు కల వస్తే మీరు ఎదుర్కొంటున్న ఏదో ఓ సమస్యను కొంత సేపు పక్కన పెట్టాలని చూస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇలాంటి కలలు సాధారణంగా పురుషుల కంటే మహిళలకే ఎక్కువగా వస్తాయట. మీ జీవిత భాగస్వామిని మోసం చేస్తున్నట్టు కల వస్తే అది మీ భాగస్వామి మీ పట్ల చూపుతున్న శ్రద్ధ, ఆసక్తిని తెలియజేస్తుంది. ఇదేకాకుండా బీ భాగస్వామిపై మీరు నమ్మకం కోల్పోతే కూడా ఇలాంటి కలలు వస్తాయి. ఎక్కడికైనా ఆలస్యంగా వెళ్లినట్టు కల వస్తే తరువాత రోజు ఆ వ్యక్తి నిర్దిష్ట సమయానికల్లా ఏదైనా ముఖ్యమైన ప్రదేశానికి తప్పనిసరిగా వెళ్లాలని అర్థం. అయితే ఎల్లప్పుడూ ఆలస్యంగా వెళ్లే వారికి ఈ కలలు ఎక్కువగా వస్తాయట.
దంతాలు ఊడిపోయినట్టుగా కల వస్తే కొందరు దీన్ని అపశకునంగా, మరికొందరు శుభంగా భావిస్తారు. ఈ కల వచ్చిన వ్యక్తుల్లో కొందరు తమకు పట్టుదల, శక్తి, ఆత్మవిశ్వాసం పెరిగాయని భావిస్తారు. మరికొందరు తమ ఆత్మవిశ్వాసం సన్నగిల్లిందని అనుకుంటారు. మహిళలల్లో ఇలాంటి కలలు వస్తే వారు తమ కోరికలు నెరవేరాలని ఆశిస్తున్నట్టు అర్థం చేసుకోవాలి. అదే పురుషుల్లో అయితే లైంగిక వాంఛ తీర్చుకోవడం కోసం ఆసక్తి చూపుతున్నారని అర్థం చేసుకోవాలి. పాములు కనపడినట్టు కల వస్తే ఆ వ్యక్తి తనను తాను మార్చుకుంటానికి ప్రయత్నిస్తున్నాడని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పాములు కొద్ది రోజులకు ఒకసారి తమ చర్మాన్ని కుబుసం రూపంలో విడుస్తాయిగా. అలాగే వ్యక్తులు కూడా తమను తాము కొత్త వ్యక్తిత్వానికి మార్చుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తుంది. దీన్ని అనేక మంది శుభంగానే భావిస్తారు.