లవర్స్ అన్నాక.. కొందరు అందులో పీకల్లోతు కూరుకుపోతారు. ఎంతలా అంటే.. అసలు ఒకరిని విడిచి ఒకరు ఉండలేరేమోనన్నంతగా గాఢంగా ప్రేమించుకుంటారు. ఒక్క క్షణం కూడా విరహ తాపాన్ని భరించలేరు. అయితే ఇక ఇలాంటి గాఢ ప్రేమికులు గనక విడిపోయారనుకోండి.. అప్పుడు వారికి ఉండే బాధ అంతా ఇంతా కాదు. తమ ప్రేమను ఒక పట్టాన మరిచిపోరు. అంతలా వారు ఎఫెక్ట్ అవుతారు. ప్రేమను మరిచిపోయేందుకు శతవిధాలా ప్రయత్నిస్తారు. కానీ అది వారికి వీలు కాదు. అనుక్షణం లవర్ గుర్తుకు వస్తూ మనస్సు అంతా అల్ల కల్లోలంగా ఉంటుంది. అయితే అలాంటి ప్రేమ విఫలమైన వారు కింద ఇచ్చిన పలు సూచనలు పాటిస్తే తమ ప్రేమను, తమ లవర్‌ను చాలా సులభంగా మరిచిపోయి మళ్లీ యథావిధిగా లైఫ్‌ను ప్రారంభించేందుకు అవకాశం ఉంటుంది. మరి ఫెయిల్యూర్ ప్రేమికులు పాటించాల్సిన ఆ సూచనలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. ప్రేమికులు విడిపోయాక కూడా తమ తమ లవర్స్ వారికి ఒక్కోసారి గుర్తుకు వస్తూ ఉంటారు. అయితే అలా గుర్తుకు రాకుండా ఉండాలంటే మీ మాజీ లవర్ తో మీకు ఏమాత్రం అవసరం ఉండదనే విషయాన్ని గుర్తుంచుకోండి. వారికి మీకు, మీతో వారికి ఎలాంటి అవసరం ఉండదని, రాదని అనుక్షణం అనుకుంటే లవర్స్‌ను, ప్రేమను మరిచిపోయి హ్యాపీగా ఉండవచ్చు.
2. అనుక్షణం మీకు మీ మాజీ ప్రియుడు లేదా ప్రియురాలు గుర్తుకు వస్తుంటే ఆ ఆలోచనలను వేరే వైపుకు మళ్లించండి. ఆ ఆలోచనల గురించి పెద్దగా పట్టించుకోకండి. ఆ ఆలోచన అసలు మనస్సులోకి రాగానే వెంటనే మనస్సును వేరే వైపుకు డైవర్ట్ చేయండి. లేదంటే కొద్ది రోజులు ఎటైనా మీరున్న ప్రాంతాన్ని విడిచి పెట్టి వేరే దగ్గర ఉండి చూడండి. కచ్చితంగా మీలో మార్పు వస్తుంది. మీ మాజీ లవర్‌ను, ప్రేమను మీరు మరిచిపోతారు. కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు.
3. మీలాగా లవ్‌లో ఫెయిల్ అయిన వారితో స్నేహం చేయండి. వారితో మీ బాధలు పంచుకోండి. ఇద్దరికీ ఒకే సమస్య ఉంటుంది కాబట్టి ఇద్దరికీ ఆ విషయంలో ఎలాంటి ఇబ్బంది కలగదు. ఒకరి గురించి ఒకరు చెప్పుకోండి. బాధలు పంచుకుంటే మనస్సు మరింత తేలికవుతుంది.
4. లవ్ లో ఫెయిల్ అయిన చాలా మంది మద్యం, పొగతాగడం అనే వ్యసనాలకు బానిసలవుతారు. కాబట్టి వాటి జోలికి వెళ్లకండి. అందుకు బదులుగా టూర్లు వేయండి. షాపింగ్ చేయండి. నచ్చిన ఆహారం తినండి. సరదాగా ఎటైనా వెళ్లి గడపండి. మీ గురించి మీరు ఆలోచించండి. లైఫ్‌లో ఎలా సెటిల్ అవ్వాలి, ఏం సాధించాలి అనే విషయాలను దృష్టిలో ఉంచుకుని ముందుకు వెళితే మీకు మీ మాజీ ప్రేమ, లవర్ గుర్తుకు రారు.
5. రోజులో వీలున్నంత ఎక్కువ సేపు వ్యాయామం చేయండి. వ్యాయామం వల్ల శారీరక దృఢత్వమే కాదు, మానసిక ఉల్లాసం కూడా కలుగుతుంది. దీంతో లవ్‌లో ఫెయిల్ అయ్యామనే డిప్రెషన్ మూడ్ నుంచి బయటకి వచ్చి హ్యాపీగా ఉంటారు. అలా మాజీ లవర్‌ను మరిచిపోవచ్చు.
6. మిమ్మల్ని మీ లవర్ యాక్సెప్ట్ చేయలేదంటే అది వారి ప్రాబ్లం. మీ ప్రాబ్లం కాదు కదా. కనుక వారి అవసరం మీకు లేదనే విషయాన్ని గుర్తుంచుకోండి. మిమ్మల్ని లవ్ చేయని వారిని మీరు ఎలా లవ్ చేస్తారు ? అదే విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకోండి. అనుక్షణం వీలున్నంత వరకు సరదాగా, హ్యాపీగా ఉండేందుకు యత్నించండి. అది మీ మూడ్‌ను మారుస్తుంది. సంతోషంగా ఉండేలా చేస్తుంది. పాత చేదు జ్ఞాపకాలను మరిచిపోయేలా చేస్తుంది.
7. లవ్ లో ఫెయిల్ అయ్యామని చెప్పి చాలా మంది ఆ కోపాన్ని ఇతరులపై ప్రదర్శిస్తారు. అలా చేయకూడదు. మౌనంగా, ప్రశాంతంగా ఉండేందుకు యత్నించండి. ఇక ఫెయిల్యూర్ లవర్స్‌లో బాయ్స్ అయితే గర్ల్స్‌ను, గర్ల్స్ అయితే బాయ్స్‌ను ద్వేషిస్తారు. అలా చేయరాదు. ఒక అబ్బాయి లేదా అమ్మాయి అలా చేశారని మిగిలిన అబ్బాయిలు, అమ్మాయిలు కూడా అంతే అనుకోకూడదు. కొందరు భిన్నంగా కూడా ఉండవచ్చు కదా. వారిలోనూ మీకు తగిన లైఫ్ పార్ట్‌నర్ దొరకవచ్చు కదా. కనుక పాత జ్ఞాపకాలను పూర్తిగా తుడిచేసి కొత్త జ్ఞాపకాల వేట ప్రారంభించాలి.