జీవితంలో కనీసం ఒక్కసారైనా తల్లి కావాలని ప్రతి మహిళ కోరుకుంటుంది. ఆ క్రమంలోనే అధిక శాతం మంది దంపతులు తమ కలల్ని సాకారం చేసుకుంటారు. కానీ కొందరు జీవితాంతం ప్రయత్నించినా తల్లిదండ్రులు కాలేకపోతారు. అయితే వీరి సంగతి పక్కన పెడితే బిడ్డల్ని కన్న దంపతులు మాత్రం ఆనందోత్సాహాల్లో మునిగి తేలుతారు. ఈ క్రమంలో ప్రపంచ దేశాల్లోని ఆయా ప్రాంతాల్లో నివసించే ప్రజలు తమ సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు అనుగుణంగా బిడ్డలు జన్మించినప్పటి నుంచి కొంత కాలం వరకు కొన్ని పద్ధతులను విధిగా పాటిస్తారు. అయితే కొన్ని చోట్ల ఇవి అంతా మామూలుగానే జరిగినా కొంత మంది మాత్రం ప్రమాదకరమైన రీతిలో పుట్టిన బిడ్డ పట్ల సాంప్రదాయాలను పాటిస్తారు. ఈ నేపథ్యంలో అలాంటి వింతైన సాంప్రదాయాలు పాటించే వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బాలి, ఇండోనేషియాలలో అప్పుడే పుట్టిన చిన్నారులకు 3 నెలల వయస్సు వచ్చే వరకు వారిని భూమికి ఆనుకోకుండా చూస్తారు. ఒక వేళ ఆనితే ఆ చిన్నారులు త్వరగా మృతి చెందుతారని అక్కడి వారి విశ్వాసం. ఇప్పుడు చెప్పబోతున్న ఆచారాన్ని భారత్‌లోని పలు ప్రాంతాలకు చెందిన వారు ఇప్పటికీ పాటిస్తున్నారు. అదేమిటంటే అప్పుడే పుట్టిన పసికందులకు వారి తండ్రులు మరిగే పాలతో స్నానం చేయిస్తారట. దీన్ని కరాహ పూజన్ అని కూడా పిలుస్తారట.
0 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఉన్న అత్యంత శీతల ప్రదేశంలో పెద్దలు నిద్రించడానికే ఆపసోపాలు పడతారు. అయితే స్వీడన్‌లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం అప్పుడే పుట్టిన శిశువులను అలాంటి మంచు ప్రదేశాల్లో పడుకోబెడతారట. అయితే చూసేందుకు ఇది అత్యంత ప్రమాదకరంగా, హేయమైన చర్యగా ఉన్నా దీన్ని వల్ల ఆ పిల్లలకు మంచి జరుగుతుందని వారి తల్లిదండ్రులు భావిస్తారు. తల్లిని, బిడ్డను వేరు చేసే పేగును జపాన్ వాసులు అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా చూస్తారట. అందుకే వారు పుట్టిన శిశువుతోపాటు వేరయ్యే ఆ పేగును ఓ పెట్టెలాంటి దాంట్లో నిల్వ చేస్తారట.
గ్వాటెమాలాకు చెందిన మహిళలు అప్పుడే జన్మించిన తమ శిశువుతో కలిసి చన్నీటి స్నానం చేస్తారట. ఇలా చేయడం వల్ల ఆ చిన్నారుల ఆరోగ్యం బాగుంటుందని వారి విశ్వాసం. శిశువుకు మొదటి దంతం వచ్చినప్పుడు అర్మేనియా దేశస్తులు ఓ ఆచారం పాటిస్తారట. అదేమిటంటే బిడ్డకు మొదటి దంతం రాగానే ఆ చిన్నారి చుట్టూ వివిధ రకాల వస్తువులు ఉంచి ఆ చిన్నారి మొదటగా దేన్నయితే ముట్టుకుంటుందో ఆ వస్తువును బట్టి ఆ చిన్నారి జాతకం చెబుతారట. జపాన్‌లోని టోక్యో నగరంలో సొన్సోజీ అనే దేవాలయంలో ప్రతి ఏప్రిల్ నెలలో నకిజుమో పేరిట ఓ పండుగను నిర్వహిస్తారట. ఆ పండుగలో శిశువుల చేత బలవంతంగా ఏడిపిస్తారట. ఇలా చేస్తే ఆ పిల్లల చుట్టూ చేరిన దుష్ట శక్తులు పారిపోతాయని వారి నమ్మిక.
బల్గేరియాలో నవజాత శిశువులపై వారి తల్లిదండ్రులు ఉమ్మినట్టు చేస్తారట. ఇలా చేస్తే వారికి దిష్టి తగలదని నమ్ముతారు. స్పెయిన్‌లోని క్యాస్ట్రిలో డి ముర్షియా అనే గ్రామంలో ఓ వింతైన ఆచారాన్ని అక్కడి స్థానికులు పాటిస్తారు. అదేమిటంటే శిశువులందర్నీ వరుసగా పడుకోబెట్టి వారి పైనుంచి ఒక వ్యక్తిని దూకనిస్తారట. ఇలా చేస్తే ఆ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుందని వారు నమ్ముతారు. మన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఓ ప్రమాదకరమైన ఆచారాన్ని పలువురు పాటిస్తారు. అప్పుడే పుట్టిన పిల్లలను ఏదైనా దేవాలయం పై నుంచి దాదాపు 50 అడుగుల దిగువకు కింద పడేలా విసురుతారు. కింద ఉన్న వారు పెద్ద పెద్ద దుప్పట్ల వంటి సహాయంతో ఆ పిల్లలను పట్టుకుంటారు. ఇది ఆ పిల్లలకు అదృష్టాన్ని ఇస్తుందని వారు నమ్ముతారు.