Cholesterol Symptoms : మనిషి శరీరానికి కొద్ది మోతాదులో కొవ్వు అవసరమే. అది మన దేహంలోని అన్ని భాగాలు సక్రమంగా పని చేయడానికి సహాయ పడుతుంది. కానీ రక్తంలో కొవ్వు అధికం అయినపుడు అది మన ఆరోగ్యానికి హానికారకంగా మారుతుంది. చాలా సందర్భాల్లో అధిక కొలెస్ట్రాల్ ఉన్నపుడు బయటికి ఎటువంటి లక్షణాలు కనిపించవు. కానీ దీర్ఘకాలంలో దీని వలన చాలా దుష్ప్రభావాలు ఉంటాయి. అందుకే దీనిని నిశ్శబ్ద శత్రువు అని పిలుస్తారు. కొన్ని సందర్భాల్లో మాత్రం మన కళ్లు మనలోని అధిక కొలెస్ట్రాల్ లక్షణాలను తెలియజేస్తాయి.
కళ్లను పరీక్షించినపుడు కొన్ని లక్షణాలను మనం గుర్తించవచ్చు. ఇవి కొలెస్ట్రాల్ లెవల్స్ అధికంగా ఉన్నాయనడానికి ఒక హెచ్చరికగా మనం అనుకోవచ్చు. అధిక కొవ్వు గుండె ఆరోగ్యాన్ని నష్ట పరచడం మాత్రమే కాకుండా కళ్లకి కూడా హానికారకం అయ్యే అవకాశం ఉంటుంది. కళ్లలో ఇంకా కళ్ల చుట్టూ ఉండే ప్రాంతంలో తేడాలు రావడం మనం గమనించవచ్చు. కంటి చూపుపై కూడా ప్రభావం చూపిస్తుంది. ఇవి అధిక కొలెస్ట్రాల్ ఉన్నప్పుడు సాధారణంగా కనిపించే లక్షణాలు.
ఇంకా కళ్ల చుట్టూ కనిపించే ఎలాంటి లక్షణాలను బట్టి మనం అధిక కొవ్వును గుర్తించవచ్చు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. కళ్లు లేదా ముక్కు చుట్టూ ఉండే ప్రాంతంలో చదునుగా లేదా ఉబ్బెత్తుగా ఉన్నట్టు పసుపు రంగులోకి మారడం గమనించవచ్చు. అధిక కొవ్వు వలన కనిపించే లక్షణాలలో ఇది అతి సాధరణమైనది. దీనినే వైద్య బాషలో జ్యాంతేలాస్మా అంటారు. జ్యాంతేలాస్మా ఉన్నవారిలో దాదాపు 50 శాతం వారికి అధిక కొవ్వు ఉంటుంది. సాధారణంగా అధిక బరువు, పొగ తాగేవారు, డయాబెటిస్ ఇంకా హైబీపీ ఉన్న వారిలో ఇది కనిపిస్తుంది. అలాగే కొందరిలో కళ్లలోని కార్నియా చుట్టూ తెల్లని రింగ్ లా ఏర్పడుతుంది. దీనిని కార్నియల్ ఆర్కస్ అని పిలుస్తారు. ఇది సాధారణంగా వయసు పైబడడం వలన వస్తుంది. కానీ అధిక కొవ్వు వలన ఇది ముందుగానే ఏర్పడుతుంది.
అలాగే కన్ను వెనుక భాగంలో అతి సున్నితమైన రెటీనా పొర ఉంటుంది. దీనికి ధమనులు, సిరల ద్వారా రక్త ప్రసరణ జరుగుతుంది. ఇక ఈ ధమనులు, సిరలకు కొలెస్ట్రాల్ అడ్డుపడినపుడు అవి మూసుకుపోవడం జరుగుతుంది. దీని వలన రక్తం ఇంకా ఇతర ద్రవాలు రెటీనా పొరలోకి లీక్ అవడం మొదలవుతుంది. ఇలా జరిగినప్పుడు కళ్లలో వాపు, కంటి చూపు మందగించడం, కళ్లలో నొప్పి కలగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే శరీరంలోని అధిక కొవ్వును నియంత్రించడం ద్వారా ఇలాంటి సమస్యలన్నింటి నుండి బయట పడేందుకు అవకాశం ఉంటుంది.