Kidneys : మన శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపించడంలో మూత్ర పిండాలు ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మూత్ర పిండాలు నిరంతరంగా పని చేస్తూనే ఉండాలి. శరీరంలోని వ్యర్థాలను, విష పదార్థాలను వడబోసి మూత్ర పిండాలు వాటిని బయటకు పంపిస్తాయి. కానీ ప్రస్తుత తరుణంలో చాలా మంది మూత్రాశయ సంబంధిత సమస్యలు, మూత్ర పిండాలలో రాళ్లు వంటి సమస్యలతో బాధపడుతున్నారు. మూత్రపిండాల ఆరోగ్యం మనం తీసుకునే ఆహారం, తాగే నీటి శాతంపై ఆధారపడి ఉంటుంది. మూత్ర పిండాలు ఆరోగ్యంగా ఉండడానికి మనం పాటించాల్సిన సూచనలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. మద్యపానం వల్ల మూత్రపిండాల ఆరోగ్యం దెబ్బ తింటుంది. మద్యం మూత్ర పిండాలపై ఒత్తిడిని కలిగించి అవి దెబ్బ తినేలా చేస్తుంది. కనుక మద్యపానం చేయకపోవడమే ఆరోగ్యానికి చాలా మంచిది.
2. మనలో చాలా మంది మూత్రం వచ్చినప్పుడు వెళ్లకుండా ఆపుకుంటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల మూత్రపిండాలకు ఎంతో హాని కలుగుతుంది. ఇలా చేయడం వల్ల మూత్రపిండాలలో రాళ్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక మూత్రాన్ని ఎక్కువ సేపు ఆపుకోకూడదు. మూత్రం వచ్చిన వెంటనే పోసేయాలి.
3. మనం రుచి కోసం వంటల్లో ఉపయోగించే ఉప్పు కూడా మూత్రపిండాల పని తీరును దెబ్బ తీస్తుంది. ఉప్పును అధికంగా వాడడం వల్ల అధిక రక్త పోటు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. రోజుకి 5 గ్రాముల కంటే అధికంగా ఉప్పును తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. కనుక ఉప్పు వాడకాన్ని తగ్గించాలి.
4. పంచదార అధికంగా కలిగిన పదార్థాలను, పానీయాలను తీసుకోవడం వల్ల కూడా మూత్ర పిండాలలో రాళ్లు వస్తాయి. కనుక వీటిని తక్కువగా తీసుకోవడం మంచిది.
5. శరీరానికి తగినంత నిద్ర లభించక పోతే మూత్రపిండాలు అనారోగ్యాలకు గురవుతాయి. కనుక రోజుకు కనీసం 6 నుంచి 8 గంటలు అయినా సరే నిద్రపోవాలి.
6. ప్రోటీన్స్ అధికంగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల మూత్రపిండాలపై ఒత్తిడి అధికంగా పడి మూత్ర పిండాలు త్వరగా దెబ్బ తింటాయి. కనుక ప్రోటీన్స్ అధికంగా ఉన్న ఆహార పదార్థాలను తక్కువగా తీసుకోవాలి.
7. శరీరంలో విటమిన్స్, మినరల్స్ లోపం వల్ల కూడా మూత్ర పిండాల ఆరోగ్యం దెబ్బ తింటుంది. విటమిన్ బి6, విటమిన్ ఎ, మెగ్నిషియం అధికంగా కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల మూత్ర పిండాల పనితీరు మెరుగుపడడమే కాకుండా మూత్ర పిండాలు ఆరోగ్యంగా ఉంటాయి.
8. మనం తాగే నీరు మూత్ర పిండాలను ఆరోగ్యంగా ఉంచడంలో ప్రాధాన పాత్ర పోషిస్తుంది. మనం రోజుకి కనీసం 6 నుండి 7 గ్లాసుల నీటిని తీసుకోవడం వల్ల మూత్ర పిండాలు ఆరోగ్యంగా ఉంటాయి.
ఈ నియమాలను పాటించడం వల్ల మూత్ర పిండాలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అలాగే మూత్ర పిండాలలో రాళ్లు వచ్చే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.