ఫంగస్ వల్ల మన కాలి వేళ్లకు వచ్చే ఓ రకమైన చర్మ వ్యాధినే అథ్లెట్స్ ఫుట్ (Athlete’s foot) అంటారు. ఇది Trichophyton rubrum, Epidermophyton floccosum, Trichophyton mentagrophytes అనే 3 రకాల ఫంగస్‌ల వల్ల వస్తుంది. అలాగే కాలివేళ్లకు చెమట ఎక్కువగా పట్టడం, రోగ నిరోశక శక్తి తక్కువగా ఉండడం, పాదాలకు రక్త సరఫరా సరిగ్గా లేకపోవడం, సరిగ్గా శుభ్రం చేయని సాక్సులు వాడడం, పబ్లిక్ స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొట్టడం, కాళ్లకు రక్షణ లేకుండా మురికి నీటిలో తిరగడం… వంటి కారణాల వల్ల కూడా ఈ వ్యాధి వస్తుంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జనాభాలో ప్రతి 100 మందికి 3 నుంచి 15 మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారని సర్వేలు చెబుతున్నాయి.
అథ్లెట్స్ ఫుట్ వచ్చిన వారిలో పాదాలు పగలడం, దురద పెట్టడం, చర్మం కందినట్లు ఎరుపుగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అలాగే పొక్కులు వస్తాయి. నొప్పి ఉంటుంది. ఈ క్రమంలో ఇన్‌ఫెక్షన్ కాలి వేళ్ల చివరకి కూడా వ్యాపిస్తుంది. దీంతో మరింత నొప్పి, మంట, దురద కలుగుతాయి. అయితే ఈ వ్యాధి ఉన్నవారు మరొకరిని తాకితే అది నేరుగా వారికి సంక్రమించేందుకు అవకాశం ఉంటుంది. లేదా వారు వాడిన సాక్సులు, ఇతర వస్తువులను ఉపయోగించినా ఈ వ్యాధి వస్తుంది. ఇక కుటుంబంలో ఈ వ్యాధి ఎవరికైనా వస్తే.. జన్యు పరంగా వారి తరువాతి తరాల వారికి కూడా ఈ వ్యాధి వచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది.
డెర్మటైటిస్ అనబడే స్కిన్ ఇన్‌ఫెక్షన్ ఉన్నవారి చర్మంపై దద్దుర్లు ఎక్కువగా వస్తాయి. దీంతో వారు అథ్లెట్స్ ఫుట్ బారిన పడే అవకాశం మరింత ఎక్కువగా ఉంటుంది. ఇక అథ్లెట్స్ ఫుట్ వ్యాధి బారి నుంచి బయటపడాలంటే.. పాదాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. చెమట ఎక్కువగా వచ్చే వారు సాక్సులు లేదా వాటితో కలిపి షూస్‌ను కూడా ధరించరాదు. వీలైనంత వరకు పాదాలకు గాలి సోకేలా చూసుకోవాలి. అలాగే డాక్టర్ సూచన మేరకు యాంటీ ఫంగల్ క్రీములు, పౌడర్లు ఉపయోగించాలి. దీంతోపాటు వెల్లుల్లి రసాన్ని పాదాలపై రాయడం, టీ ట్రీ ఆయిల్ తో మర్దనా చేయడం చేస్తే.. ఫంగస్ ఇన్‌ఫెక్షన్ త్వరగా తగ్గుముఖం పడుతుంది.
అలాగే శరీర రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, డయాబెటిస్ ఉన్నవారు.. రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాలు తీసుకోవాలి. ఈ క్రమంలో 2 నుంచి 4 వారాల్లోపు సమస్య నుంచి ఉపశమనం లభించకపోతే డాక్టర్ వద్దకు అవసరం అయితే మళ్లీ వెళ్లాలి. సమస్యను నిర్లక్ష్యం చేస్తే ఇన్‌ఫెక్షన్ పెద్దదై ప్రాణాల మీదకు రావచ్చు. కనుక తగిన సమయంలో స్పందించి వ్యాధిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి..!