Gas Trouble Symptoms : మారిన మన ఆహారపు అలవాట్ల కారణంగా మనలో చాలా మంది ఎదుర్కొంటున్న జీర్ణసమస్యలల్లో యాసిడ్ రిప్లెక్స్ కూడా ఒకటి. దీనిని జిఇఆర్డి లేదా గ్యాస్ట్రోఇంటెస్టినల్ రిప్లక్స్ వ్యాధి అంటారు. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సమస్య బారిన పడుతున్నారని చెప్పవచ్చు. మనం తీసుకునే ఆహారాన్ని పొట్టలోకి చేర్చే నాళంలోకి కడుపులో ఉండే ఆమ్లాలు పదే పదే రావడాన్నే యాసిడ్ రిప్లెక్స్ అంటారు. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే ఇది మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. యాసిడ్ రిఫ్లెక్స్ ను మనం కొన్ని లక్షణాల ద్వారా గమనించవచ్చు. ఈ లక్షణాలు మనలో కనిపించిన వెంటనే ఆలస్యం చేయకుండా వైద్యున్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. యాసిడ్ రిప్లెక్స్ కారణంగా మనలో కనిపించే లక్షణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
యాసిడ్ రిప్లెక్స్ కారణంగా గుండెల్లో నొప్పి, మంట, ఛాతిలో నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. గుండె, ఛాతిలో చాలా అసౌకర్యంగా ఉంటుంది. అలాగే నోట్లో లాలాజలం ఎక్కువగా తయారవుతుంది. ఆహారం తీసుకున్న తరువాత నోట్లో ఎక్కువగా లాలాజలం తయారైతే అది యాసిడ్ రిప్లెక్స్ గా భావించాలి. గొంతులో చికాకు, మంట కారణంగా ఇలా లాలాజలం ఎక్కువగా తయారవుతుంది. అదే విధంగా శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈ సమస్య రాత్రి ఎక్కువగా ఉంటుంది. పడుకున్న తరువాత గురక, దగ్గు ఎక్కువగా వస్తుంది. ఇది కూడా యాసిడ్ రిప్లెక్స్ లో ఒక భాగమే. అలాగే నోట్లో ఎల్లప్పుడూ చేదుగా, పుల్లగా ఉంటుంది. పుల్లటి త్రేన్పులు ఎక్కువగా వస్తూ ఉంటాయి.
యాసిడ్ రిప్లెక్స్ కారణంగా కడుపులో ఎక్కువగా యాసిడ్ తయారవుతుంది. దీంతో కడుపులో నొప్పి, వికారం, వాంతులు వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఈ సమస్యతో బాధపడే వారిలో కడుపులో తీవ్రమైన అసౌకర్యం ఉంటుంది. కడుపు ఉబ్బరం, అజీర్తి, పొత్తి కడుపులో వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఈ విధంగా ఈ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యున్నిసంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. మనం తీసుకునే ఆహారంలో కూడా చాలా మార్పులు చేసుకోవాలి. ఈ సమస్యను ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వీలైనంత త్వరగా చికిత్స తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.