కిడ్నీలు మన శరీరంలో ఎంతటి కీలక విధులు నిర్వహిస్తాయో అందరికీ తెలిసిందే. శరీరంలో పేరుకుపోయే వ్యర్థ, విష పదార్థాలను కిడ్నీలు బయటకు తరిమేస్తాయి. రక్తాన్ని వడపోస్తాయి. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ తమ కిడ్నీల ఆరోగ్యం పట్ల కచ్చితంగా శ్రద్ధ వహించాల్సిందే. లేదంటే ఇబ్బందులు తప్పవు. అయితే మీకు తెలుసా..? పలు అలవాట్లు మన కిడ్నీల ఆరోగ్యాన్ని, పనితనాన్ని దెబ్బ తీస్తాయని. అవును, మేం చెబుతోంది నిజమే. దీన్ని సాక్షాత్తూ వైద్యులు కూడా తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో మనం వదిలేయాల్సిన ఆ అలవాట్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
నిత్యం తగినంత నీటిని తాగితేనే శరీరంలో ఉన్న వ్యర్థాలు బయటికి పోతాయి. లేదంటే కిడ్నీల్లో ఆ వ్యర్థాలు పేరుకుపోతాయి. అప్పుడు కిడ్నీ స్టోన్స్, మూత్రాశయ సంబంధ సమస్యలు వస్తాయి. కనుక నిత్యం తగినంత నీటిని తాగాల్సిందే. చాలా మంది మూత్రం వస్తున్నా దాన్ని ఎక్కువ సేపు ఆపుకుంటారు. దీంతో మూత్రాశయంపైనే కాదు, కిడ్నీలపై కూడా ప్రభావం పడుతుంది. కనుక మూత్రం వస్తే వెంటనే వెళ్లి రావాలి. కానీ దాన్ని ఎక్కువ సేపు అలాగే బంధించకూడదు. సోడియం ఎక్కువగా ఉన్న ఉప్పు, ఇతర ఆహార పదార్థాలను తినడం తగ్గించాలి. లేదంటే శరీరంలో పేరుకుపోయే సోడియాన్ని బయటకు పంపడం కోసం కిడ్నీలు ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. అప్పుడు కిడ్నీలు పాడైపోతాయి.
కెఫీన్ ఎక్కువగా ఉండే కాఫీ, టీ వంటి పదార్థాలతోపాటు సోడా, డ్రింక్స్‌ను తాగకూడదు. అలా తాగితే వాటిలో ఉండే విష పదార్థాలు కిడ్నీల ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తాయి. పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడితే ఆ ప్రభావం కిడ్నీలపై పడుతుంది. దీంతో కిడ్నీల పనితనం మందగిస్తుంది. కనుక పెయిన్ కిల్లర్స్ వాడకాన్ని తగ్గించాలి. ప్రోటీన్లు ఎక్కువగా ఉండే మాంసం, పప్పు దినుసులు, ఇతర పదార్థాలను తింటుంటే క్రమంగా ఆ పదార్థాల ప్రభావం కిడ్నీలపై పడుతుంది. అప్పుడు సమస్యలు వస్తాయి. కనుక ప్రోటీన్ ఫుడ్ తగ్గించాలి.
తరచూ ఫ్లూ జ్వరం, జలుబు వంటివి వస్తున్నా కిడ్నీల ఆరోగ్యం దెబ్బ తింటుంది. అలాంటి వారు కిడ్నీ టెస్ట్ చేయించుకోవాలి. అవసరం ఉన్న మేరకు మందులను వాడితే ఫలితం ఉంటుంది. మద్యం ఎక్కువగా సేవించినా కూడా కిడ్నీలకు రిస్కే. దాని వల్ల కిడ్నీల ఆరోగ్యం దెబ్బ తింటుంది. కనుక మద్యపానం మానేయాలి.