Ulcer : కడుపులో అల్సర్లతో మనలో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అల్సర్ల సమస్య తలెత్తడానికి అనేక కారణాలు ఉంటాయి. హెలికోబాక్టర్ పైలోరి అనే బ్యాక్టీరియా కారణంగా కడుపులో ఉండే సున్నితమైన మ్యూకస్ మెంబరైన్ అనే సున్నితమైన పొర దెబ్బతింటుంది. దీంతో కడుపులో పుండ్లు ఏర్పడతాయి. అలాగే జీర్ణాశయంలో ఉండే హైడ్రోక్లోరిక్ యాసిడ్ సాంద్రత ఎక్కువవడం వల్ల కూడా ఈ పొర దెబ్బతింటుంది. చాలా మంది ఈ అల్సర్ల సమస్యను గ్యాస్, ఎసిడిటీ సమస్యగా భావిస్తారు. దీంతో అల్సర్లు ఎక్కువై తీవ్రమైన పుండ్లుగా మారతాయి. ఇన్ఫెక్షన్ కూడా ఎక్కువవుతుంది. క్రమంగా ఈ అల్సర్లు క్యాన్సర్ గా మారే అవకాశం కూడా ఉంది. కనుక ఈ అల్సర్లను ముందుగానే గుర్తించి తగిన చికిత్స తీసుకోవడం చాలా అవసరం.
కడుపులో అల్సర్లను కొన్ని లక్షణాల ద్వారా మనం ముందుగానే గుర్తించవచ్చు. కడుపులో అల్సర్ల కారణంగా మనలో కనిపించే లక్షణాలు ఏమిటి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. కుడపులో అల్సర్లు ఉంటే ముందుగా కడుపులో నొప్పి వస్తుంది. ఈ నొప్పి వివిధ సమయాల్లో వస్తుంది. ఈ నొప్పి వచ్చే సమయాన్ని బట్టి అల్సర్ ఎక్కడ వచ్చిందో మనం గుర్తించవచ్చు. ఆహారం తీసుకునేటప్పుడు నొప్పి వస్తే అన్న వాహికలో అల్సర్ ఉన్నట్టుగా గుర్తించాలి. ఆహారం తీసుకున్న వెంటనే కడుపులో నొప్పి వస్తే జీర్ణకోశంలో అల్సర్ ఉన్నట్టుగా భావించవచ్చు. అలాగే రాత్రి సమయంలో తరచుగా నొప్పి వస్తూ ఉంటే చిన్న ప్రేగు మొదటి భాగంలో అల్సర్ ఉన్నట్టుగా భావించాలి. అదే విధంగా కడుపులో అల్సర్లు ఉంటే తరచుగా గొంతులో మంటగా ఉంటుంది. కడుపులో అల్సర్లు ఉంటే ఆకలి వేయడం తగ్గుతుంది. అలాగే కడుపులో అల్సర్లు ఉంటే వాంతులు అవుతాయి.
అల్సర్లు ఉండడం వల్ల మనం తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవ్వదు. దీంతో వాంతులు అవుతాయి. అలాగే అల్సర్ల కారణంగా రక్తహీనత సమస్య తలెత్తుతుంది. అలాగే అల్సర్ల వల్ల కడుపులో నొప్పి వస్తుంది. ఈ నొప్పి కారణంగా చాలా మంది ఆహారాన్ని తీసుకోవడం తగ్గిస్తారు. దీని వల్ల బరువు తగ్గుతారు. అలాగే శరీరంలో పోషకాహార లోపం తలెత్తుతుంది. అదే విధంగా అల్సర్ల వల్ల ఛాతిలో నొప్పి వస్తుంది. తరచూ ఛాతిలో నొప్పి వచ్చినట్టయితే కడుపులో అల్సర్లకు సంబంధించిన పరీక్షలు తప్పక చేయించుకోవాలి. అదే విధంగా కడుపులో అల్సర్లు ఉంటే మలం నల్ల రంగులో వస్తుంది. అల్సర్ల కారణంగా రక్తస్రావం ఎక్కువగా అవుతుంది. దీంతో రక్తం మలంతో కలిసి నల్ల రంగులో వస్తుంది. ఇటువంటి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యున్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం చాలా అవసరం.