Ragi Peanut Laddu : రాగులు.. మనం ఆహారంగా తీసుకునే చిరు ధాన్యాల్లో ఇది ఒకటి. రాగులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రాగుల్లో అనేక పోషకాలు ఉంటాయి. రాగులను ఆహారంగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. బరువు తగ్గడంలో, శరీరానికి బలాన్ని చేకూర్చడంలో, ఎముకలను ధృడంగా ఉంచడంలో, రక్తపోటును అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో ఇలా అనేక విధాలుగా రాగులు మనకు సహాయపడతాయి. ఈ రాగులతో మనం సంగటి, జావ, రొట్టె వంటి వాటిని తయారు చేస్తాము. ఇవే కాకుండా రాగులతో మనం ఎంతో రుచిగా ఉండే రాగి లడ్డునూ కూడా తయారు చేసుకోవచ్చు. రాగి లడ్డూలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని తినడం వల్ల రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. రాగులతో ఎంతో రుచిగా ఉండే లడ్డూలను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రాగి లడ్డు తయారీకి కావల్సిన పదార్థాలు..
రాగిపిండి – ఒక కప్పు, వేయించి పొట్టు తీసిన పల్లీలు – ఒక కప్పు, వేయించిన బాదం పప్పు – 2 టేబుల్ స్పూన్స్, బెల్లం తురుము – ఒక కప్పు, యాలకుల పొడి – అర టీ స్పూన్.
రాగి లడ్డు తయారీ విధానం..
ముందుగా రాగిపిండిని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత తగినన్ని నీళ్లు పోస్తూ పిండిని చపాతీ పిండిలా కలుపుకోవాలి. తరువాత దీనిని రొట్టెలాగా వత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెన్నాన్ని ఉంచి వేడి చేయాలి. పెనం వేడయ్యాక పెనంపై నూనె వేసుకోవాలి. తరువాత దీనిపై రాగిరొట్టెను వేసి రెండు వైపులా చక్కగా కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. రొట్టె ఆరిన తరువాత దీనిని ముక్కలుగా చేసుకుని జార్ లో వేసుకోవాలి. తరువాత దీనిని మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలో వేసుకోవాలి. తరువాత అదేజార్ లో పల్లీలు, బాదం పప్పు వేసి బరకగా మిక్సీ పట్టుకుని రాగిమిశ్రమంలో వేసి కలుపుకోవాలి.
ఇందులోనే బెల్లం తురుము, యాలకుల పొడి వేసి కలపాలి. తరువాత ఈ మిశ్రమానంతటిని జార్ లో వేసి మరోసారి మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత దీనిని మరోసారి అంతా కలుపుకుని లడ్డూలుగా చుట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే రాగి లడ్డూలు తయారవుతాయి. ఈ లడ్డూలు పది రోజుల వరకు తాజాగా ఉంటాయి. ఈ లడ్డూలను రోజుకు ఒకటి లేదా రెండు చొప్పున తినడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఈ లడ్డూలను పిల్లలకు ఇవ్వడం వల్ల వారిలో ఎదుగుదల చక్కగా ఉంటుంది.