Triglycerides : ట్రైగ్లిజరైడ్స్ అనేవి మన రక్తంలో ఉండే ఒక రకమైన కొవ్వు పదార్థం. మనం తినే ఆహారంలో మనకు అవసరం లేని కొవ్వు గా దీనిని చెబుతారు. కొవ్వు ఎక్కువగా ఉన్న ఆహారం తిన్నప్పుడు మిగిలిపోయిన కొవ్వు ట్రైగ్లిజరైడ్స్ రూపంలో మన శరీరంలోని కొవ్వు కణాలలో నిల్వ చేయబడుతుంది. ట్రైగ్లిజరైడ్స్ అధిక స్థాయిలో ఉన్నప్పుడు అది హైపర్ ట్రైగ్లిజరిడేమియాకి దారి తీస్తుంది.
క్యాలరీలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం, చక్కెర పదార్థాలు, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం మొదలైనవి ట్రైగ్లిజరైడ్స్ పెరగడానికి కారణం అవుతాయి. మామూలుగా కొలెస్ట్రాల్ పరీక్ష చేసినప్పుడు తీసుకునే నాలుగు రకాల కొలతల్లో ఒకటి ట్రైగ్లిజరైడ్స్ స్థాయిని తెలుపుతుంది. కొవ్వులో ట్రైగ్లిజరైడ్లు ఎక్కువ అయినప్పుడు అవి రక్త ప్రవాహంలో కలుస్తాయి. ఇది మనకు చాలా హానికారకంగా మారుతుంది.
శరీరంలో ఉండే అధిక ట్రైగ్లిజరైడ్స్ వలన కలిగే లక్షణాలలో రక్త నాళాలు, గుండె, మెదడు మొదలైన వాటికి సంబంధించిన తీవ్రమైన వ్యాధులు ఉత్పన్నమయ్యే ప్రమాదం పొంచి ఉంటుంది. ఊబకాయం, థైరాయిడ్ లోపాలు, కాలేయం, మూత్రపిండ వ్యాధులు, జన్యు పరమైన వ్యాధులు, ధూమపానం, మద్యపానం మొదలైన వాటి వలన ట్రైగ్లిజరైడ్స్ స్థాయులు పెరగడం జరుగుతుంది.
ఆరోగ్యకరమైన ఆహర అలవాట్లు, ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండడం, క్రమం తప్పని వ్యాయామం లాంటివి పాటించడం వలన హైపర్ ట్రైగ్లిజరిడేమియా నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు.