Ear Wax : మనకు సాధారణంగా చెవి ఉండి గులిమి వస్తూ ఉంటుంది. ఇది జిగురు రూపంలో ఉంటుంది. మన శరీరం నుండి విడుదల అయ్యే వ్యర్థాలు వివిధ శరీర భాగాల నుండి బయటకు వస్తాయి. వీటిలో కొన్ని వ్యర్థాలు చెవి నుండి గులిమి రూపంలో బయటకు వస్తాయి. కెరాటిన్ అనే ప్రోటీన్ చెవి లోపల ఉండే చర్మంపై మరణించిన కణాలు, నూనె, కొలెస్ట్రాల్, ఆల్కహాల్, సీక్వాలిన్ అనే మరో పదార్థం అన్నీ కలిసి గులిమిలా తయారవుతాయి. చెవిలో తయారయ్యే గులిమి మనకు మేలు చేస్తుంది.
గాలి ద్వారా వచ్చే బ్యాక్టీరియా, వైరస్ లను చెవి లోపలికి వెళ్లకుండా గులిమి అడ్డుకుని చెవిని రక్షిస్తుంది. చెవి లోపల వినికిడి మార్గాన్ని తేమగా ఉంచడంలో గులిమి సహాయపడుతుంది. ఈ విధంగా సహాయపడే గులిమి మన చెవిలో మరీ ఎక్కువగా ఉండడం కూడా మంచిది కాదు. ఈ గులిమి మన చెవి లోపల ఉండే కర్ణభేరికి ఇబ్బంది కలిగించకుండా ఉండాలి. మన చెవిలో కర్ణ భేరి 1.5 ఎమ్ఎమ్ మందంతో చాలా సున్నితంగా ఉంటుంది. శబ్ద తరంగాలు కర్ణభేరి ద్వారానే చెవిలోకి ప్రవేశిస్తాయి. చెవిలో గులిమి ఉండవలసిన మోతాదు కంటే ఎక్కువగా పేరుకు పోయినప్పుడు శబ్ద తరంగాలు కర్ణభేరిని చేరవు. దీని వల్ల వినికిడి శక్తి తగ్గుతుంది.
చెవిలో గులిమి ఎక్కువగా ఉన్నప్పుడు అది గట్టి పడి చెవిలో నొప్పి రావడం, చెవిలో శబ్దాలు రావడం, దురదలు రావడం వంటివి జరుగుతాయి. ఇలా నిల్వ ఉన్న గులిమి ఇన్ ఫెక్షన్స్ కు దారి తీసి చెవి నుండి వాపన రావడం, చెవి నుండి చీము కారడం వంటివి జరుగుతాయి. కనుక ఈ గులిమిని మనం తరుచూ శుభ్రం చేసుకుంటూ ఉండాలి. 10 నుండి 15 రోజులకు ఒకసారి చెవిలో ఉండే గులిమిని శుభ్రం చేసుకుంటూ ఉండాలి. గులిమిని శుభ్రం చేసుకోడానికి చేతి వేళ్లను, పుల్లలను, పిన్నీసులను, మొన తేలిన వస్తువులను కానీ వాడరాదు. వీటిని వాడడం వల్ల కర్ణభేరి దెబ్బ తినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.
తక్కువ మోతాదులో ఉండే గులిమిని మనం తరచూ ఉపయోగించే ఇయర్ బడ్స్ సహాయంతో తొలగించవచ్చు. మరీ ఎక్కువగా ఉన్న, గట్టిపడిపోయిన గులిమిని హైడ్రోజన్ పెరాక్సైడ్ సహాయంతో తొలగించవచ్చు. తలను ఒక పక్కకు వంచి చెవి రంధ్రం నిండే వరకు హైడ్రోజన్ పెరాక్సైడ్ ద్రావణాన్ని వేసి 4 నుండి 5 నిమిషాల పాటు అలాగే ఉండాలి. దీని వల్ల గులిమి మెత్తబడుతుంది. 5 నిమిషాల తరువాత తలను మరో పక్కకు వంచి హైడ్రోజన్ పెరాక్సైడ్ ద్రావణాన్ని తొలగించిన తరువాత ఇయర్ బడ్స్ సహాయంతో చెవిని శుభ్రం చేసుకోవాలి. చెవిని శుభ్రం చేసుకోడానికి మంచి నాణ్యత కలిగిన ఇయర్ బడ్స్ ను మాత్రమే వాడాలి. ఇలా చేయడం వల్ల గట్టి పడిన గులిమి తొలిగి పోతుంది. ఇన్ ఫెక్షన్స్ వంటివి రాకుండా.. వినికిడి శక్తి తగ్గకుండా ఉంటుంది. అయితే ఇప్పుడు ఇచ్చింది కేవలం విషయ పరిజ్ఞానం కోసం మాత్రమే. ఎవరైనా దీన్ని పాటించే ముందు ఈఎన్‌టీ వైద్యుడిని సంప్రదించడం మంచిది.