ప్రస్తుత తరుణంలో చాలా మంది దంపతులకు సంతానం కలగడం లేదు. దీంతో వారు సంతాన సాఫల్య కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. అయితే వారిలో చాలా ప్రయత్నాల తరువాత కేవలం కొందరికే సంతానం కలుగతుంది. ఇక కొందరికైతే సంతానం అసలు కలగరు. అయితే స్త్రీ లేదా పురుషుడు.. ఇద్దరిలో పిల్లలు పుట్టకపోవడానికి ఎవరు కారణం అవుతారు ? అంటే..
పిల్లలు పుట్టకపోవడానికి స్త్రీ ఎంత కారణమో, పురుషుడు కూడా అంతే కారణం. అంటే ఈ విషయాన్ని 3 వంతులుగా విభజిస్తే ఒక వంతు స్త్రీ, ఒక వంతు పురుషుడు కారణం అవుతారు. ఇక మిగిలిన ఇంకో వంతులో పలు ఇతర కారణాలు ఉంటాయి. అందువల్ల పిల్లలు పుట్టకపోవడం వెనుక స్త్రీ ఎంత కారణమో పురుషుడు కూడా అంతే కారణం అవుతాడు. కనుక ఇద్దరిలోనూ ఎవరిపై కూడా నెపం వేయాల్సిన పనిలేదు.
సాధారణంగా ఏడాదిపాటు దంపతులు ప్రయత్నించినా పిల్లలు కలగకపోతే దాన్ని సంతాన లోపం సమస్యగా భావిస్తారు. అయితే కొందరు స్త్రీలకు సంతాన సాఫల్య చికిత్స తీసుకోకపోయినా కొన్ని ఏళ్లకు పిల్లలు పుడతారు. ఇక కొందరు స్త్రీలకు మొదటి సారి సంతానం కలిగినా, రెండోసారి కలగరు. దీన్ని సెకండరీ ఇన్‌ఫెర్టిలిటీ అంటారు. ఈ క్రమంలో వీరు సంతాన సాఫల్య చికిత్స తీసుకుంటే మళ్లీ పిల్లలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక మొదటి సారే సంతాన సాఫల్య చికిత్స తీసుకుంటే వారికి సంతానం కలిగే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.
పురుషుల్లో సంతాన లోపం సమస్య ఏర్పడేందుకు పలు కారణాలు ఉంటాయి. తగినంత వీర్యం ఉత్పత్తి కాకపోవడం, శుక్ర కణాల కౌంట్ తక్కువగా ఉండడం, తగిన ఆకారంలో కణాలు ఉండకపోవడం, కదలికలు లేకపోవడం, ముందుకు కొనసాగలేకపోవడం, వయస్సు మీద పడుతుండడం, పొగ తాగడం, మద్యం సేవించడం, అధిక బరువు ఉండడం, విష పదార్థాలు, పెస్టిసైడ్స్, భార లోహాలతో శరీరం విషతుల్యంగా మారడం, వృషణాలు వాపులకు గురి కావడం, యాంటీ బాడీలు శుక్ర కణాలను నాశనం చేయడం, హార్మోన్ల అసమతుల్యతలు, టెస్టోస్టిరాన్ తక్కువగా ఉత్పత్తి కావడం, వివిధ రకాల మందులను వాడడం వల్ల పురుషుల్లో సంతాన లోపం సమస్య ఏర్పడుతుంది.
స్త్రీలలో అయితే రుతు క్రమం సరిగ్గా ఉండకపోవడం, హార్మోన్ల సమస్యలు, థైరాయిడ్, పీసీవోఎస్, అధిక బరువు ఉండడం, లైంగిక ఇన్ఫెక్షన్లు, వ్యాధుల బారిన పడడం, వివిధ రకాల మందులను వాడడం, గర్భాశయంలో నీటి బుడగలు.. వంటి కారణాల వల్ల సంతాన లోపం ఏర్పడుతుంది.
అయితే పిల్లలు పుట్టకపోతే కేవలం ఒకరిపైనే నింద వేయడం సరికాదు. లోపాన్ని సరిగ్గా గుర్తించి చికిత్స తీసుకోవాలి. కొన్ని సార్లు కేవలం స్త్రీనో, లేదా కొన్నిసార్లు కేవలం పురుషుడో, లేదా కొన్నిసార్లు ఇద్దరూ కూడా సంతానం లోపం సమస్యకు కారణమవుతారు. కనుక అసలు కారణాన్ని తెలుసుకుని చికిత్స అందిస్తే ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. దీంతో సంతానం కలిగే అవకాశాలు మెరుగు పడతాయి.