Tablet Swallowing : ప్రస్తుత తరుణంలో చాలా మంది అనారోగ్యాల బారిన పడుతున్నారు. అందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. నిరంతర ఒత్తిడి, డిప్రెషన్, ఆందోళన, పోషకాహార లోపం, కాలుష్యం, వంశ పారంపర్య సమస్యలు.. ఇలా అనేక కారణాల వల్ల చాలా మంది అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. దీంతో చాలా మంది దీర్ఘకాలికంగా చికిత్స తీసుకోవాల్సి వస్తోంది. ఈ క్రమంలోనే చాలా మంది రోజూ అనేక సంఖ్యలో ట్యాబ్లెట్లను వేసుకుంటున్నారు. ఒక్కో అనారోగ్య సమస్యకు ఒక్కో ట్యాబ్లెట్ చొప్పున కొందరు రోజుకు పదుల సంఖ్యలో మందులను మింగుతున్నారు.
అయితే మందులను మింగేందుకు కచ్చితంగా నీళ్లను తాగాల్సి ఉంటుంది. లేదంటే ట్యాబ్లెట్లు పూర్తిగా కరగవు. దీంతో వాటిని శరీరం శోషించుకోదు. ఫలితంగా మనం ట్యాబ్లెట్ వేసుకున్నా పనిచేయదు. దీంతో అనారోగ్య సమస్య అలాగే ఉంటుంది. కనుక ట్యాబ్లెట్లను మింగినప్పుడు తప్పకుండా నీళ్లను తాగాల్సి ఉంటుంది. అయితే ట్యాబ్లెట్లను మింగినప్పుడు నీళ్లను తాగే విషయంలో చాలా మందికి ఒక సందేహం వస్తుంటుంది. అదేమిటంటే.. ట్యాబ్లెట్లను మింగితే ఎన్ని నీళ్లను తాగాలి..? అని సందేహిస్తుంటారు. అయితే దీనికి నిపుణులు ఏమని సమాధానం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
ట్యాబ్లెట్లను మింగినప్పుడు కనీసం ఒక గ్లాస్ నీళ్లను పూర్తిగా తాగాలి. అప్పుడే అవి సరిగ్గా కరుగుతాయి. కొందరు ఒకటి కన్నా ఎక్కువ ట్యాబ్లెట్లను వేసుకుంటుంటారు. అయితే అప్పుడు కూడా ఒక గ్లాస్ నీళ్లు చాలు. కానీ కొన్ని ట్యాబ్లెట్లకు 60 ఎంఎల్ నుంచి 120 ఎంఎల్ మధ్యలో నీళ్లు సరిపోతాయి. ఈ విషయాన్ని వైద్యులు చెబుతారు. కనుక ఇలాంటి ట్యాబ్లెట్ల విషయంలో ఆందోళన చెందాల్సిన పనిలేదు. కానీ ఇతర ఏ ట్యాబ్లెట్‌లను వేసుకున్నా సరే.. కనీసం ఒక గ్లాస్ నీళ్లను అయినా తాగాల్సి ఉంటుంది. దీంతో ట్యాబ్లెట్స్ సరిగ్గా కరిగి చక్కగా పనిచేస్తాయి. ట్యాబ్లెట్లను మింగే విషయంలో ఈ జాగ్రత్తలను తప్పకుండా పాటించాలని నిపుణులు చెబుతున్నారు.