Chicken Pachadi : మనలో చాలా మంది చికెన్ ను ఇష్టంగా తింటారు. చికెన్ ను ఆహారంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి కావల్సిన ప్రోటీన్స్ తో పాటు ఇతర పోషకాలు కూడా లభ్యమవుతాయి. చికెన్ తో మనం రకరకాల వంటలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. చికెన్ తో చేసుకోదగిన వంటకాల్లో చికెన్ పచ్చడి కూడా ఒకటి. చికెన్ పచ్చడి రుచి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. ఈ పచ్చడిని మనం చాలా సులభంగా , తక్కువ సమయంలోనే తయారు చేసుకోవచ్చు. రుచిగా చికెన్ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చికెన్ పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
బోన్ లెస్ చికెన్ – ఒక కిలో, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 100 గ్రా., దాల్చిన చెక్క + లవంగాలు – 5 గ్రా., ధనియాలు – 2 టేబుల్ స్పూన్స్, ఆవాలు – 2 టేబుల్ స్పూన్స్, మెంతులు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – 50 గ్రా., నూనె – 500 గ్రా., నిమ్మకాయలు – 5.
చికెన్ పచ్చడి తయారీ విధానం..
ముందుగా కళాయిలో ఆవాలు, ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, మెంతులు వేసి దోరగా వేయించాలి. తరువాత వీటిని ఒక జార్ లోకి తీసుకుని మెత్తని పొడిలా చేసుకోవాలి. తరువాత శుభ్రంగా కడిగినప చికెన్ ను కళాయిలో వేసి వేయించాలి. చికెన్ లోని నీరు అంతా పోయి వరకు చికెన్ ను వేయించాలి. ఇలా వేయించిన తరువాత చికెన్ లో నూనె పోసి ఎర్రగా అయ్యే వరకు వేయించాలి. చికెన్ ముక్కలు ఎర్రగా అయిన తరువాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత ఉప్పు, కారం, ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పొడి వేసి కలపాలి.
దీనిని మరో రెండు నిమిషాల పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఇందులో 5 నిమ్మకాయల నుండి తీసిన నిమ్మరసాన్ని వేసి కలపాలి. ఈ చికెన్ పచ్చడి చల్లారిన తరువాత గాజు సీసాలోకి తీసుకుని నిల్వ చేసుకోవాలి. గాలి, తడి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల పచ్చడి నె రోజుల పాటు తాజాగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో చికెన్ పచ్చడి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది.