మన శరీరంలో కిడ్నీలు కూడా అత్యంత ముఖ్యమైన అవయవం కిందకు వస్తాయి. ఇవి రక్తాన్ని శుద్ధి చేస్తాయి. దాన్ని వడబోస్తాయి. అందులో ఉండే మలినాలను మూత్రం రూపంలో బయటకు పంపుతాయి. అయితే ఒక్కో సారి కిడ్నీలు అనారోగ్యానికి గురవుతాయి. అందుకు అనేక కారణాలు కూడా ఉంటాయి. ఈ క్రమంలో కారణం ఏమున్నప్పటికీ కిడ్నీలు అనారోగ్యానికి గురైతే మాత్రం మనకు పలు లక్షణాలు కనిపిస్తాయి. వాటిని గుర్తించడం ద్వారా కిడ్నీలు అనారోగ్యం బారిన పడ్డాయని సులభంగా తెలుసుకోవచ్చు. దాంతో డాక్టర్‌ను కలసి తగు విధంగా చికిత్స తీసుకోవచ్చు. మరి కిడ్నీలు అనారోగ్యం బారిన పడ్డాయని తెలిపే లక్షణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా.
కిడ్నీలు ఎర్రరక్త కణాల సంఖ్య పెరిగేలా చేసే ఎరిథ్రోప్రోయిటిన్ అనే హార్మోన్ ని విడుదల చేస్తాయి.. ఈ హార్మోన్ సరిగ్గా విడుదల కాకపోతే ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గిపోయి ఎనీమియా వ్యాధి వస్తుంది. అలా ఎనీమియా వచ్చిందంటే కిడ్నీల పనితీరు సక్రమంగా లేదు అని భావించవచ్చు. ఎనీమియా (రక్త హీనత) తీవ్రం అయితే మొదడుకు ఆక్సిజన్ సరఫరా తగ్గి మనిషికి ఏ పని చేయబుద్ధికాక బద్ధకంగా తయారు అవుతారు. దేని మీద దృష్టిపెట్టబుద్ధి కాదు. మతిమరుపు వస్తుంది. ఇలాంటి లక్షణాలు ఉన్నా కిడ్నీలు అనారోగ్యానికి గురయ్యాయని చెప్పవచ్చు. కిడ్నీకి ఏవిధమైన జబ్బులు సోకినా మోకాళ్ళు, కీళ్ళు కాళ్ళు ఉబ్బిపోయి శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది.
మూత్ర విసర్జన లో నియంత్రణ కోల్పోవడం, తరచుగా మూత్ర విసర్జన జరగడం, లేదంటే మూత్రం తక్కువగా రావడం, మూత్ర విసర్జన సమయంలో మంట, నొప్పి, రంగు మారడం, నురగతో కూడిన మూత్రం ఇవన్నీ కిడ్నీ లు వ్యాధికి గురయ్యాయి అనే లక్షణాలుగా గుర్తించవచ్చు. కిడ్నీలుండే చుట్టుప్రక్కల నొప్పిగా ఉంటే యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు అనుమానించవచ్చు. ఏదైనా ఆహార పదార్ధం తింటే వాటి రుచి లోహం రుచి అనిపిస్తే కిడ్నీలు దెబ్బతిన్నట్లు భావించవచ్చు. తరచుగా రాషెష్, దురద, మంటలు వంటివి వచ్చినా కిడ్నీ సమస్యలు ఉన్నట్లు అన్నమాట.
రక్తంలో మలినాలు చేరినా చర్మం పొడిబారుతుంది. దీంతో కిడ్నీ వ్యాధికి గురయ్యారని తెలుసుకోవాలి. కిడ్నీ వ్యాధులు వెన్ను భాగంలో నొప్పిని కలిగిస్తాయి. కిడ్నీల్లో రాళ్ళు ఏర్పడితే వెన్ను భాగపు కింద భాగం నుంచి గజ్జల ప్రాంతం వరకూ నొప్పి కలుగుతుంది. ఈ లక్షణాలు గనక కనిపిస్తే కిడ్నీలు అనారోగ్యంగా లేవని తెలుసుకోవాలి. దీంతో వైద్యున్ని సంప్రదిస్తే తగు చికిత్స తీసుకుని అనారోగ్యాన్ని నయం చేసుకోవచ్చు.