కరోనా వైరస్ నేపథ్యంలో ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత శుభ్రత పెరిగిపోయింది. చేతులను ఎక్కువగా శుభ్రం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే హ్యాండ్ వాష్‌లు, హ్యాండ్ శానిటైజర్ల వాడకం కూడా పెరిగిపోయింది. అయితే చేతులను దేంతో శుభ్రం చేసుకున్నా సరే కచ్చితంగా 20 సెకన్ల పాటు కడుక్కోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. అది ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.
కోవిడ్ వచ్చిన వారి నుంచి వెలువడే తుంపర్లు అన్ని చోట్లా పడతాయి. ఈ క్రమంలో ఆ ఉపరితలాలను మనం టచ్ చేసినా లేదా కోవిడ్ వచ్చిన వారికి దగ్గర్లో ఉన్నా మనకు కోవిడ్ వ్యాప్తి చెందుతుంది. కోవిడ్ ఉన్న వ్యక్తి నుంచి వెలువడే తుంపర్లు ఉపరితలాలపై పడితే అవి ఆ ఉపరితలాన్ని బట్టి నిర్దిష్టమైన సమయం పాటు ఉంటాయి. అందులో వైరస్ అలాగే నిలిచి ఉంటుంది. ఈ క్రమంలో ఆ ఉపరితలాలను మనం టచ్ చేస్తే మనకు వైరస్ వ్యాప్తి చెందుతుంది. అందుకనే చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో వైరస్ వ్యాప్తి చెందకుండా అడ్డుకోవచ్చు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ), భారత ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖలు చెబుతున్న ప్రకారం.. సబ్బు, హ్యాండ్ వాష్ లేదా హ్యాండ్ శానిటైజర్.. దేంతో చేతులను శుభ్రం చేసుకున్నా సరే కనీసం 20 సెకన్ల పాటు కడుక్కోవాలి. హ్యాండ్ శానిటైజర్ అయితే అందులో కనీసం 60 శాతం ఆల్కహాల్ ఉన్నది వాడాలి.
20 సెకన్ల పాటు చేతులను ఎందుకు కడుక్కోవాలంటే.. మనం ఒక చేయిని మరో చేయితో కలిపి రుద్దుతూ శుభ్రం చేసుకుంటాం కదా. ఆ ప్రక్రియను 20 సెకన్ల పాటు చేస్తే చేతులపై ఉండే బాక్టీరియా, వైరస్‌లు పూర్తి స్థాయిలో నశిస్తాయి. చేతుల్లో అక్కడక్కడా నక్కి ఉండే సూక్ష్మ క్రిములు మన చేతుల కదలికలకు బయటకు వచ్చే సరికి 20 సెకన్ల సమయం పడుతుంది. కనుక 20 సెకన్ల పాటు కచ్చితంగా చేతులను కడుక్కోవాలి. అప్పుడే మన చేతులపై ఉండే బాక్టీరియా, వైరస్‌లు పూర్తిగా నశిస్తాయి. దీంతో మనకు వ్యాధులు రాకుండా ఉంటాయి.
ఈ వివరాలను అమెరికన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్ వారు ఫిజిక్స్ ఆఫ్ ఫ్లుయిడ్స్ అనే జర్నల్‌లో ప్రచురించారు. వాటిని హామండ్ కన్సల్టింగ్ లిమిటెడ్ వారు తాజాగా వివరించారు. అందువల్ల ప్రతి ఒక్కరూ చేతులను శుభ్రం చేసుకుంటే కనీసం 20 సెకన్ల పాటు అయినా కడుక్కోవాల్సి ఉంటుంది. దీంతో ఆరోగ్యంగా ఉండవచ్చు.