ఎన్నో దశాబ్దాల నుంచి మనిషి ప్లాస్టిక్ తో తయారు చేసిన ఉత్పత్తులను ఉపయోగిస్తున్నాడు. ఇప్పటి వరకు మహా సముద్రాల్లోనే కాక భూమిపై ఎన్నో చోట్ల ఎన్నో కోట్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను పడేశారు. ఇప్పటికీ పడేస్తున్నారు. ప్లాస్టిక్ వాడకం రోజు రోజుకీ ఎక్కువైపోతోంది. ముఖ్యంగా మనం ఆహారాల కోసం ప్లాస్టిక్ తో తయారు చేసిన వంట పాత్రలు, స్పూన్లు, ప్లేట్లు ఇతర వస్తువులను ఎక్కువగా ఉపయోగిస్తున్నాం. కానీ వాటితో జరిగే అనర్థాలను గ్రహించలేకపోతున్నాం.
ప్లాస్టిక్ తో తయారు చేసిన పాత్రలు, ఇతర వస్తువులను వాడడం ఆరోగ్యానికి హానికరం అని పరిశోధకులు ఎప్పటి నుంచో చెబుతున్నారు. అయినప్పటికీ ప్లాస్టిక్ వస్తువులను వాడడం మానడం లేదు. ఫలితంగా అనారోగ్య సమస్యలు, వ్యాధులను కొని తెచ్చుకుంటున్నాం.
ప్లాస్టిక్ వస్తువుల్లో అనేక రకాల కెమికల్స్ ఉంటాయి. అవన్నీ విష పదార్థాలు అవి మన శరీరంలోకి చేరితే మనకు తీవ్రమైన వ్యాధులు వస్తాయి. ప్లాస్టిక్ వస్తువుల్లో సీసం, కాడ్మియం, పాదరసం వంటి భార లోహాలు, విష పదార్థాలు ఉంటాయి. ఈ క్రమంలో వాటిని కలిగిన ప్లాస్టిక్ వస్తువులను మనం వాడితే మనం తినే ఆహారంలో అవి కలుస్తాయి. తరువాత అవి మన రోగ నిరోధక వ్యవస్థపై ప్రభావం చూపిస్తాయి.
ప్లాస్టిక్ వస్తువులను వాడడం వల్ల క్యాన్సర్లు, మెదడు పనితీరుపై ప్రభావం పడడం, పిల్లల ఎదుగుల సరిగ్గా లేకపోవడం వంటి సమస్యలు వస్తాయి. ప్లాస్టిక్ వస్తువులలో ఉండే బీపీఏ లేదా ఇతర హానికర సమ్మేళనాలు మన ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. ఈ క్రమంలోనే థైరాయిడ్ గ్రంథి పనితీరు దెబ్బ తింటుంది. థైరాయిడ్ సమస్యలు వస్తాయి. ఎక్కువ మందికి హైపోథైరాయిడిజం అనే సమస్య వస్తుంది. ప్రస్తుత తరుణంలో థైరాయిడ్ వస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరగడం వెనుక ఉన్న కారణం ప్లాస్టిక్ వస్తువులను వాడడమే అని చెప్పవచ్చు.
ప్లాస్టిక్ వస్తువులను ఎక్కువ కాలం పాటు వాడడం వల్ల ఆస్తమా, లివర్ దెబ్బ తినడం, నాడులు, మెదడు దెబ్బ తినడం, కిడ్నీ వ్యాధులు వస్తాయి. కనుక ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని తగ్గించాలి. నీటిని తాగాల్సి వస్తే స్టీల్ లేదా రాగితో తయారు చేసిన వస్తువులను వాడాలి. ఆహార పదార్థాలను ప్లాస్టిక్ బాక్సులు, ప్లేట్లు, బౌల్‌లలో పెట్టరాదు. ఇతర లోహాలతో తయారు చేసిన వస్తువులను వాడాలి. అలాగే సామాన్లకు, కూరగాయలకు ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు కాకుండా క్లాత్‌తో తయారు చేసిన బ్యాగ్‌లను వాడాలి. ఈ విధంగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తే మన ఆరోగ్యం బాగు పడడమే కాదు, పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది.