అనేక రకాల వ్యాధులు రాకుండా ఉండేందుకు నిత్యం మనం పౌష్టికాహారం తీసుకోవడంతోపాటు వ్యాయామం లేదా యోగా వంటివి చేయడం అత్యంత ఆవశ్యకం అయింది. యోగాకు ప్రస్తుతం చాలా మంది ప్రాధాన్యతను ఇస్తున్నారు. అయితే యోగా చేయడంలో కొందరికి ఆటంకాలు వస్తుంటాయి. కొందరు యోగా సరిగ్గా చేయలేకపోతుంటారు. అలాంటి వారు కింద తెలిపిన సూచనలను పాటిస్తే దాంతో ఎలాంటి అడ్డంకి లేకుండా సజావుగా యోగా చేయవచ్చు. యోగా ద్వారా కలిగే ప్రయోజనాలను పూర్తి స్థాయిలో పొందవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
1. యోగాను ఉదయం పరగడుపునే చేయాల్సి ఉంటుంది. ధ్యానం రాత్రి కూడా చేయవచ్చు. కానీ యోగాను మాత్రం ఉదయం ఖాళీ కడుపుతో చేయాలి. అయితే ఒక్క వజ్రాసనాన్ని తిన్న తరువాత కూడా వేయవచ్చు. మిగిలిన ఆసనాలను పరగడుపుతోనే వేయాలి. అందుకు గాను యోగా కోసం ఉదయం కొంత సమయం కేటాయించాలి. ఏయే యోగాసనాలను ఎంత సేపు వేస్తారో ముందుగానే లెక్కించుకోవాలి. అందుకు గాను ఉదయం అవసరం అయ్యే సమయాన్ని కేటాయించాలి. దీంతో అనుకున్న యోగాసనాలను సరైన సమయంలో వేయగలుగుతారు.
2. యోగా ఆసనాలను వేసిన తరువాత 2 గంటల వరకు ఏమీ తినరాదు. అప్పుడే సరైన ఫలితాలు వస్తాయి.
3. యోగా కోసం చాప లేదా ప్రత్యేకంగా లభించే యోగా మ్యాట్‌లను వాడాలి. నేలపై యోగా ఆసనాలు వేయరాదు.
4. యోగాసనాలు వేసేవారికి అడ్డంకులు ఏర్పడుతాయి. కనుక వారు వాటికి దూరంగా ఉండాలి. ఫోన్‌ను సైలెంట్ మోడ్‌లో పెట్టాలి. ఇంట్లో ఆసనం వేస్తే ఎవరూ డిస్టర్బ్ చేయకుండా చూసుకోవాలి. అవసరం అయితే నాయిస్ క్యాన్సెలింగ్ ఇయర్‌ఫోన్స్‌ను ధరించి చిన్న శబ్దంతో ఇష్టమైన సంగీతం వింటూ యోగా చేయవచ్చు.
5. యోగా ఆసనాలు వేసే ముందు 2 నిమిషాల పాటు వార్మప్ చేయాలి. దీంతో ఆసనాలను సులభంగా వేసేందుకు వీలు కలుగుతుంది.
6. యోగా చేసేటప్పుడు శ్వాసపై ధ్యాస ఉంచాలి. ఆసనాలకు అనుగుణంగా శ్వాసను పీల్చడం, వదలడం చేయాలి.
7. సర్జరీలు అయినవారు, తీవ్ర గాయాలకు గురై కోలుకుంటున్నవారు, అనారోగ్యాల బారిన పడినవారు యోగా ఆసనాలు వేసే ముందు వైద్యుల సలహా తీసుకోవాలి.
8. తేలికపాటి ఆసనాలను సొంతంగా వేయవచ్చు. కానీ కొన్ని ఆసనాలు కష్టంగా ఉంటాయి. కనుక వాటిని గురువుల సమక్షంలోనే వేయాలి.
9. యోగా ఆసనాలు వేశాక కొంత సేపు ధ్యానం చేస్తే మంచిది. మైండ్ రిలాక్స్ అవుతుంది. అన్ని టెన్షన్స్ పోతాయి.