భారతదేశంలో వెన్ను నొప్పి సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు. ముఖ్యంగా 16-34 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారికి వెన్ను నొప్పి బాగా వస్తుందని సర్వేలు చెబుతున్నాయి. వారిలో 20 శాతం మందికి సమస్య మరింత తీవ్రంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఏటా దేశంలో వెన్ను నొప్పి బాధితుల సంఖ్య కూడా పెరుగుతోంది. అయితే వెన్ను నొప్పి వచ్చేందుకు పలు ముఖ్య కారణాలు ఉంటాయని నిపుణులు తెలియజేస్తున్నారు. మరి ఆ కారణాలు ఏమిటంటే..
1. ఇంట్లో లేదా బయట ఎక్కడైనా జారి పడి గాయాలు అయినా లేదా ప్రమాదాల్లో గాయ పడినా వెన్నుకు దెబ్బ తాకి ఆ విధంగా నొప్పి వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. ఇలా వచ్చే నొప్పి వారాల తరబడి అలాగే ఉంటుంది. చికిత్స తీసుకోకపోతే నొప్పి మరింత ఎక్కువవుతుంది.
2. కంప్యూటర్ల ఎదుట నిత్యం గంటల తరబడి కూర్చునే వారికి కూడా వెన్ను నొప్పి వస్తుంటుంది. అయితే మధ్య మధ్యలో విరామం తీసుకుంటూ వ్యాయామం చేస్తుంటే ఇలా వచ్చే నొప్పిని సులభంగా తగ్గించుకోవచ్చు.
3. వయస్సు మీద పడడం వల్ల ఎవరికైనా సరే వెన్ను నొప్పి సహజంగానే వస్తుంది. అయితే పౌష్టికాహారం తీసుకుంటూ వ్యాయామం చేస్తుంటే ఈ తరహా నొప్పిని తగ్గించుకోవచ్చు.
4. విటమిన్ డి లోపం వల్ల కూడా వెన్ను నొప్పి వస్తుంటుంది. కనుక వెన్ను నొప్పి వారాల తరబడి అలాగే ఉన్నవారు ముందుగా విటమిన్ డి లెవల్స్ చెక్ చేయించుకోవాలి. లోపం ఉంటే విటమిన్ డి ట్యాబ్లెట్లను డాక్టర్ల సలహా మేరకు వాడుకోవాలి. అలాగే విటమిన్ డి ఉండే ఆహారాలను తీసుకోవాలి. దీంతో ఈ తరహా నొప్పి నుంచి బయట పడవచ్చు.
5. ఆర్థరైటిస్ సమస్య ఉన్నవారిలోనూ వెన్ను నొప్పి వస్తుంటుంది. కనుక ఆర్థరైటిస్ ఉన్నవారు ఆ సమస్యను తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. దీంతో వెన్ను నొప్పి కూడా తగ్గిపోతుంది.
6. కిడ్నీ స్టోన్ల సమస్య ఉన్నా కూడా కిడ్నీలు ఉన్న భాగంలో వెన్నులో నొప్పి వస్తుంటుంది. కాబట్టి కిడ్నీ స్టోన్లు ఉంటే వాటిని తొలగించుకునే ప్రయత్నం చేయాలి. దీంతో వెన్ను నొప్పి తగ్గుతుంది.
7. గర్భిణీలకు సహజంగానే నెలలు నిండే కొద్దీ వెన్ను నొప్పి అధికమవుతుంటుంది. కనుక వారు ఎక్కువ సేపు విశ్రాంతి తీసుకోవాలి. బిడ్డ ప్రసవించాక ఈ నొప్పి దానంతట అదే తగ్గిపోతుంది. అలాగే పౌష్టికాహారం కూడా తీసుకోవాలి. దీంతో ఎముకలు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి.
8. వెన్ను భాగంలో ఎక్కడైనా సరే ట్యూమర్లు ఉంటే నొప్పి వస్తుంది. కనుక డాక్టర్లు పరీక్షలు చేసి ఈ విషయాన్ని తెలుసుకుంటారు. ఇలాంటి సందర్భాల్లో శస్త్ర చికిత్స ద్వారా ట్యూమర్‌ను తీసేస్తారు. దీంతో నొప్పి తగ్గిపోతుంది.
9. వెన్నెముకపై డిస్క్‌లు ఒత్తిడిని కలగజేస్తే నొప్పి వస్తుంది. ఇలాంటి నొప్పి వల్ల నాడీ సంబంధ భాగాలు దెబ్బ తింటాయి. కనుక వెంటనే డాక్టర్‌ను కలిసి పరీక్షలు చేయించుకోవడం మంచిది. వారు నొప్పి ఏ కారణం చేత వస్తుందో ముందుగా తెలుసుకుంటారు. అందుకు తగిన విధంగా చికిత్సను అందిస్తారు. దీంతో వెన్ను నొప్పి తగ్గిపోతుంది.