రక్తదానాన్ని మహాదానం అని చెప్పవచ్చు. ఎందుకంటే మనం ఇచ్చే రక్తం ఇంకొకర్ని ప్రాణాపాయ స్థితి నుంచి రక్షిస్తుంది. కనుక ఎవరైనా సరే రక్తదానం చేస్తే ఇంకొకరి ప్రాణాలను రక్షించిన వారమవుతాం. అయితే రక్తదానం ఎవరు చేయాలన్నా కొన్ని నియమాలు ఉంటాయి. వాటిని పరిశీలించాకే వైద్యులు దాతల నుంచి రక్తాన్ని సేకరిస్తారు. ఆ నియమాలు ఏమిటంటే…
* రక్తం ఇచ్చే దాత బరువు కనీసం 50 కిలోలు అయినా ఉండాలి.
* రక్తదాత వయస్సు 18 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉండాల్సి ఉంటుంది.
* రక్తదాత హిమోగ్లోబిన్ స్థాయిలు కనీసం 12.5 గ్రా/డీఎల్ ఉండాలి.
* దాత పల్స్ రేట్ 50 నుంచి 100 మధ్య స్థిరంగా ఉండాలి.
* డయాస్టోలిక్ బీపీ 50 నుంచి 100 మధ్య, సిస్టోలిక్ బీపీ 100 నుంచి 180 మధ్య ఉండాలి.
* అంటువ్యాధులు, హెచ్‌ఐవీ, క్యాన్సర్, డయాబెటిస్, క్షయ, ఆస్తమా వ్యాధులు, లోబీపీ, హైబీపీ, గుండె జబ్బులు, కుష్టు, కిడ్నీ వ్యాధులు వంటి సమస్యలు ఉన్నవారు రక్తం ఇవ్వకూడదు.
* రక్తదాత శరీర ఉష్ణోగ్రత 37.5 డిగ్రీల సెంటీగ్రేడ్ అంతకన్నా తక్కువగా ఉండాలి.
* ఆరోగ్యవంతుడైన వ్యక్తి ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తం ఇవ్వవచ్చు. ఎందుకంటే మన శరీరంలో ఆ సమయంలోగా కొత్తగా రక్తకణాలు ఏర్పడి రక్తం తయారవుతుంది.
* టాటూ లేదా పియర్సింగ్ చేయించుకున్న వారు 6 నెలల వరకు రక్తం ఇవ్వకూడదు.
* పలు రకాల వ్యాక్సిన్లు వేయించుకున్నవారు వ్యాక్సిన్‌కు అనుగుణంగా 1 నెల నుంచి 6 నెలల వరకు రక్తదానం చేయరాదు.
* మద్యం సేవించిన వారు 24 గంటలు ఆగాక రక్తం ఇవ్వాలి.
* గర్భిణీలు, పాలిచ్చే తల్లులు రక్తం ఇవ్వరాదు.
* నెల రోజుల్లో దంత చికిత్స, ఇతర శస్త్ర చికిత్సలు అయిన వారు కూడా రక్తదానం చేయరాదు.
* అబార్షన్ అయిన మహిళలు రక్తదానం చేయాలంటే 6 నెలలు ఆగాలి.
* ఫిట్స్, అలర్జీలు ఉన్నా రక్తదానం చేయకూడదు.