సాధారణంగా మనం అనారోగ్యాల బారిన పడినప్పుడు ఏ వైద్యుడి వద్దకు వెళ్లినా సరే నాలుకను చూపించమంటారు. నాలుక స్థితి, రూపు రేఖలు, ఇతర అంశాలను పరిశీలించి వైద్యులు మనకు మందులు రాస్తారు. దాని ప్రకారం మనం మందులను వాడుతాం. అయితే నాలుకను చూడడం వల్ల వారికి ఏం తెలుస్తుంది ? అంటే..
శరీరంలో ఫంగస్ ఇన్‌ఫెక్షన్లు ఏర్పడినా లేదా జీర్ణ సమస్యలు ఉన్నా, డయాబెటిస్ సమస్య ఉన్నవారిలో నాలుకపై తెల్లని మచ్చలు ఏర్పడుతాయి. కొందరికి ఆ మచ్చలు నల్లగా కూడా ఉంటాయి. అలా ఉంటే ఆయా సమస్యలను డాక్టర్లు గుర్తిస్తారు. అందుకనే వారు నాలుక చూస్తారు.
నాలుక ఎర్రబారి మెరవడం, రంగు పాలిపోయి ఉండడం వంటివన్నీ ఐరన్ లోపం, రక్తహీనత ఉన్నాయని చెప్పే లక్షణాలు. దీనికి అనుగుణంగా వైద్యులు మందులను రాస్తారు.
కొందరి నాలుక మీద వెంట్రుకలు మొలిచినట్లుగా నల్లగా కనిపిస్తుంది. విపరీతంగా పొగతాగడం వల్ల లేదా శక్తివంతమైన యాంటీబయాటిక్స్ వాడటం వల్ల ఫంగస్ ఏర్పడుతుంది. అందుకనే నాలుక అలా కనిపిస్తుంది. డాక్టర్లు ఈ రకంగా నాలుక ఉంటే అందుకు తగిన విధంగా మందులను ఇస్తారు.
నాలుక వాపు ఉంటే తినడానికి, మాట్లాడానికి ఇబ్బందిగా ఉంటుంది. నాలుక వాపుతో పాటు ఒక్కోసారి రంగు కూడా మారుతుంది. శరీరంలో ఇన్‌ఫెక్షన్లు బాగా పెరిగిపోయినప్పుడు కనిపించే లక్షణం ఇది. దీన్ని పసిగట్టి వైద్యులు మందులను రాస్తారు.
నాలుక రంగు మారడం అన్నది కొందరిలో కామెర్లు, రక్తహీనత లేదా శరీరానికి సరిపడా ఆక్సిజన్ అందకపోవడం వల్ల కూడా కావచ్చు. అందువల్ల నాలుక రంగు మారితే వైద్యులు ఈ అనారోగ్యాలకు చెందిన లక్షణాలు రోగిలో ఉన్నాయో, లేదో చూసి అందుకు అనుగుణంగా మెడిసిన్లను ఇస్తారు.
ఇక నాలుక ఒక పక్కకు వాలిపోతే అది పక్షవాత లక్షణంగా పరిగణిస్తారు.
నాలుక వణకడం కనిపిస్తే అది థైరాయిడ్ గ్రంధి అతిగా పనిచేయడం కారణంగా ఉంటుంది. లేదా కొన్ని రకాల నరాల వ్యాధుల వల్ల గానీ, మల్టిపుల్ స్క్లెరోసిస్ సమస్య వల్ల గానీ కావచ్చు.
ఇలా నాలుక రంగు, స్థితి, ఇతర అంశాలను బట్టి డాక్టర్లు మనకు మందులను రాస్తారు. నాలుకతోనూ మనకు ఏయే అనారోగ్య సమస్యలు ఉన్నాయో వారు సులభంగా గుర్తిస్తారు. అందుకనే వారు నాలుకను పరీక్షిస్తారు. అందుకు అనుగుణంగా మందులను ఇస్తుంటారు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365