మలం అనేది చాలా మందికి రకరకాలుగా వస్తుంది. ముందు రోజు తిన్న ఆహార పదార్థాల రంగులకు అనుగుణంగా లేదా పసుపు లేదా గోధుమ రంగులో సహజంగానే ఎవరికైనా మలం వస్తుంది. ఇక ఐరన్ ట్యాబ్లెట్లు వేసుకునే వారికి, ఆయుర్వేద మందులను మింగే వారికి కూడా సహజంగానే మలం నల్ల రంగులో వస్తుంది. కానీ ఈ విధంగా చేయని వారికి మలం నల్ల రంగులో వస్తుందంటే అనుమానించాల్సిందే. అది తీవ్రమైన అనారోగ్య స్థితి వల్లే అయి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
జీర్ణవ్యవస్థలో పై భాగంలో లోపల రక్తస్రావం అవుతున్నా లేదా అల్సర్లు తీవ్రంగా ఉన్నా, గ్యాస్ట్రైటిస్ సమస్య వంటి కారణాల వల్ల మలం నల్ల రంగులో వస్తుంది. అలాగే జీర్ణ రసాలతో రక్తం కలిసినా మలం నలుపు రంగులో వస్తుంది.
అయితే ఐరన్ ట్యాబ్లెట్లు, మందులు, ఆహారాల వల్ల కాకుండా సాధారణంగా మలం నల్ల రంగులో వస్తుంటే అందుకు పైన చెప్పిన సమస్యలను కారణాలుగా భావించాలి. అలాగే చిన్న పేగుల్లో రక్త సరఫరా తగ్గిపోవడం, రక్తనాళాలు ఆకృతిని కోల్పోవడం, పేగుల్లోని రక్త నాళాల్లో సమస్యలు వంటి కారణాల వల్ల కూడా మలం నల్ల రంగులో వస్తుంది.
ఇక ఎరుపు రంగులో మలం వస్తుంటే దాన్ని కూడా తీవ్రమైన సమస్యనే భావించాలి. నలుపు లేదా ఎరుపు రంగుల్లో మలం వస్తుంటే ఏ మాత్రం ఆలస్యం చేయరాదు. వెంటనే డాక్టర్‌ను కలిసి పరీక్షలు చేయించుకోవాలి. ఏదైనా ఉన్నట్లు తేలితే అందుకు అనుగుణంగా మందులను వాడాలి. దీంతో తీవ్ర అనారోగ్య సమస్యలు రాకుండా ముందుగానే జాగ్రత్త వహించవచ్చు.
మలం నల్ల రంగులో వస్తుంటే డాక్టర్లు ఎంఆర్ఐ, ఎక్స్ రేలు, సీటీ స్కాన్స్, గ్యాస్ట్రో స్కోపీ, కొలనోస్కోపీ వంటి పరీక్షలు చేసి సమస్యను నిర్దారిస్తారు. అందుకు అనుగుణంగా మందులను ఇస్తారు. ఇక శరీరంలో క్యాన్సర్లు లేదా ట్యూమర్లు ఏర్పడినా కొందరికి మలం నల్ల రంగులో వస్తుంది. కనుక ఈ విషయంలో అస్సలు అశ్రద్ద చేయరాదు. వెంటనే పరీక్షలు చేయించుకుని చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది.