ప్రస్తుత తరుణంలో ఒక మనిషి ఆయుర్దాయం ఎంతో మనకు తెలుసు కదా..! 60 నుంచి 70 ఏళ్ల వరకే మనుషులు బతుకుతున్నారు. కానీ మన పూర్వీకుల ఆయుర్దాయం ఇంకా ఎక్కువగానే ఉండేది. ఒక్కొక్కరు ఎంత లేదన్నా 100 నుంచి 120 సంవత్సరాల వరకు బతికారు. అయితే మరి… మన పురాణాల్లో చెప్పినట్టుగా కలియుగానికి ముందున్న కృత యుగం (సత్య యుగం), త్రేతా యుగం, ద్వాపర యుగం లలో మనుషుల ఆయుర్దాయం ఎంతో తెలుసా..? అదే ఇప్పుడు తెలుసుకుందాం. కృత యుగం… ఈ యుగం మొత్తం 17,28,000 మనుష్య సంవత్సరాలు. ఈ యుగంలో జీవించిన మనుషుల సగటు ఆయుర్దాయం 1 లక్ష సంవత్సరాలు. అవును, మీరు విన్నది కరెక్టే. కృత యుగంలో జీవించిన వారు ఒక్కొక్కరు లక్ష సంవత్సరాల వరకు జీవించారట.
త్రేతా యుగం… ఈ యుగం నడిచింది 12,96,000 మనుష్య సంవత్సరాలు. ఈ యుగంలో మనుషుల ఆయుర్దాయం 10వేల సంత్సరాలు. వాల్మీకి రామాయణం ప్రకారం ఈ యుగంలో శ్రీరాముడు 11వేల ఏళ్ల వరకు జీవించి ఉన్నాడట. ద్వాపర యుగం… మొత్తం 8,64,000 సంవత్సరాల పాటు ద్వాపర యుగం నడిచింది. ఈ యుగంలో మనుషులు సగటున 125 ఏళ్లకు పైగానే జీవించారట. ఈ యుగంలో శ్రీకృష్ణుడు 125 ఏళ్లు జీవించి ఉన్నాడట.
కలియుగం… 4,32,000 సంవత్సరాల పాటు కలియుగం నడవనుంది. ఈ యుగంలో మనుషుల ఆయుర్దాయం 100 సంవత్సరాలకు తక్కువే. ఎక్కడో ఒకరు తప్ప చాలా మంది అన్ని సంవత్సరాల వరకు జీవించి ఉన్న దాఖలాలు లేవు. ఈ యుగంలో మనుషులు ప్రస్తుతం జీవిస్తోంది 60 నుంచి 70 ఏళ్లు మాత్రమే అని సులభంగా చెప్పవచ్చు. అయితే కలియుగం అంతం అయ్యే వరకు మనుషుల సగటు జీవితం కాలం ఇంకా పడిపోతుందట. అప్పటికి మనుషులు కేవలం 12 సంవత్సరాల పాటు మాత్రమే జీవిస్తారట.