Alasandala Kura : మన ఆరోగ్యానికి మేలు చేసే పప్పు దినుసుల్లో అలసందలు కూడా ఒకటి. అలసందలల్లో ఎన్నో పోషకాలు ఉన్నాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ అన్నీ లభిస్తాయి. అలసందలతో గారెలు, గుగ్గిళ్లే కాకుండా వీటితో మనం ఎంతో రుచిగా ఉండే కూరను కూడా తయారు చేసుకోవచ్చు. అలసందల కూర చాలా రుచిగా ఉంటుంది. ఈ కూరను తినడం వల్ల శరీరానికి బలం చేకూరుతుంది. అలసందలతో రుచిగా, కమ్మగా కూరను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
అలసందల కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 3 టేబుల్ స్పూన్స్, నెయ్యి -ఒక టీ స్పూన్, జీలకర్ర -ఒక టీ స్పూన్, వెల్లుల్లి తరుగు – ఒక టీ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, ఇంగువ – చిటికెడు, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, ఉల్లిపాయ తరుగు – ఒక కప్పు, ఉప్పు – తగినంత, అల్లం తరుగు – ఒక టీ స్పూన్, టమాటాలు – 2, పసుపు – పావు టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి -ఒక టీ స్పూన్, కారం – 2 టీ స్పూన్స్, గరం మసాలా – పావు టీ స్పూన్, నిమ్మకాయ – 1, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
అలసందలు ఉడికించడానికి కావల్సిన పదార్థాలు..
రాత్రంతా నానబెట్టిన అలసందలు – ఒక కప్పు, బిర్యానీ ఆకు – 1, లవంగాలు – 3, నల్ల యాలక్కాయ – 1, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, నూనె -ఒక టీ స్పూన్, నీళ్లు – 3 కప్పులు, తరిగిన పచ్చిమిర్చి – 3.
అలసందల కూర తయారీ విధానం..
ముందుగా కుక్కర్ లో రాత్రంత నానబెట్టిన అలసందలను వేసుకోవాలి. తరువాత మిగిలిన పదార్థాలన్నీ వేసి మధ్యస్థ మంటపై 7 విజిల్స్ వచ్చే ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె, నెయ్యి వేసి వేడి చేయాలి. తరువాత జీలకర్ర, వెల్లుల్లి తరుగు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. వెల్లుల్లి ఎర్రగా వేగిన తరువాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ తరుగు వేసి వేయించాలి. ఉల్లిపాయ ఎర్రగా వేగిన తరువాత ఉప్పు, అల్లం తరుగు, టమాట ఫ్యూరీ, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, గరం మసాలా వేసి కలపాలి. దీనిని మధ్యస్థ మంటపై నూనె పైకి తేలే వరకు వేయించాలి. తరువాత ఉడికించిన అలసందలను నీళ్లతో సహా వేసి కలపాలి. ఇప్పుడు కూరపై మూతను ఉంచి 10 నిమిషాల పాటు ఉడికించాలి.
10 నిమిషాల తరువాత పావు కప్పు అలసందలను గంటెతో మెత్తగా చేసుకోవాలి. తరువాత మరలా మూతను ఉంచి మరో 10 నిమిషాలు ఉడికించాలి. తరువాత నిమ్మరసం, కొత్తిమీర, ఒక టీ స్పూన్ నెయ్యి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే అలసందల కూర తయారవుతుంది. దీనిని చపాతీ, రోటీ, పూరీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా అలసందలతో కూరను తయారు చేసుకుని తినడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.