Allam Tea : అల్లం టీని మనలో చాలా మంది ఇష్టంగా తాగుతూ ఉంటారు. అల్లం వేసి చేసే ఈ టీ చాలా రుచిగా ఉంటుంది. ఈ టీ ని తాగడం వల్ల అల్లం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు అందుతాయి. తలనొప్పి, ఒత్తిడి తగ్గడంతో పాటు మనకు స్వాంతన కూడా కలుగుతుంది. చాలా మంది అల్లం టీ ని తయారు చేసినప్పటికి దీనిని రుచిగా తయారు చేసుకోలేకపోతుంటారు. అల్లం టీ ని పక్కా కొలతలతో రుచిగా ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
అల్లం టీ తయారీకి కావల్సిన పదార్థాలు..
యాలకులు – 2, ముదిరిన అల్లం – ఒకటిన్నర ఇంచు,నీళ్లు – పావు లీటర్, పంచదార – 2 టేబుల్ స్పూన్స్, టీ పొడి – ఒకటిన్నర టేబుల్ స్పూన్స్, పాలు – పావు లీటర్.
అల్లం టీ తయారీ విధానం..
ముందుగా రోట్లో యాలకులు వేసి దంచాలి. తరువాత అల్లం వేసి బాగా దంచాలి. ఇప్పుడు గిన్నెలో నీళ్లు, దంచిన అల్లం, యాలకులు వేసి రెండు నిమిషాల పాటు మరిగించాలి. తరువాత పంచదార వేసి ఒక నిమిషం పాటు మరిగించాలి. తరువాత టీ పొడి వేసి మరో నిమిషం పాటు మరిగించాలి. తరువాత పాలు పోసి కలుపుతూ మరిగించాలి. ఇలా 3 నిమిషాల పాటు మరిగించిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి టీ ని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే అల్లం టీ తయారవుతుంది. దీనిని వేడి వేడిగా తాగితే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా అల్లంతో టీని చేసుకుని తాగడం వల్ల రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. జలుబు, దగ్గు వంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు ఈ విధంగా అల్లం టీ ని తయారు చేసుకుని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.