Aloo Brinjal Tomato Curry : మనం వంకాయలను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వంకాయలతో చేసే కూరలు రుచిగా ఉంటాయి. ఇతర కూరగాయల వలె వంకాయలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వంకాయలతో ఎక్కువగా చేసే కూరల్లో వంకాయ టమాట కూర కూడా ఒకటి. వంకాయలు, టమాటాలు వేసి చేసే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. ఈ వంకాయ టమాట కూరలో బంగాళాదుంపలు అలాగే తక్కువ మసాలాలు వేసి మరింత రుచిగా కూడా తయారు చేసుకోవచ్చు. వంటరాని వారు కూడా ఈ ఆలూ వంకాయ టమాట కర్రీని తేలికగా తయారు చేసుకోవచ్చు. ఆలూ వంకాయ టమాట కూరను రుచిగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆలూ వంకాయ టమాట కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన వంకాయలు – 150 గ్రా., చిన్నగా తరిగిన టమాటాలు – అరకిలో, ఉడికించిన బంగాళాదుంపలు – 3, తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన పచ్చిమిర్చి – 4, జీలకర్ర – ఒక టీ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, కరివేపాకు – ఒక రెమ్మ, కారం – ఒక టేబుల్ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, గరం మసాలా – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత.
ఆలూ వంకాయ టమాట కర్రీ తయారీ విధానం..
ముందుగ కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక జీలకర్ర, తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఉల్లిపాయలు వేగిన తరువాత వంకాయ ముక్కలు వేసి వేయించాలి. వంకాయ ముక్కలు వేగిన తరువాత టమాట ముక్కలు వేసి కలపాలి. తరువాత ఉప్పు, పసుపు వేసి కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి టమాట ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. టమాట ముక్కలు మెత్తగా ఉడికిన తరువాత ఉడికించిన బంగాళాదుంపలు, కారం, గరం మసాలా వేసి కలపాలి. దీనిని మరో 5 నిమిషాల పాటు నూనె పైకి తేలే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ వంకాయ టమాట కర్రీ తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, రోటీ, పుల్కా వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. తరచూ చేసే వంకాయ టమాట కంటే ఈ విధంగా చేసిన చేసిన కూర మరింత రుచిగా ఉంటుంది. దీనిని ఇంట్లో అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.