Aloo Jeedipappu Masala Kura : మనం బంగాళాదుంపలతో రకరకాల మసాలా కూరలు తయారు చేస్తూ ఉంటాం. బంగాళాదుంపలతో చేసే మసాలా కూరలు చాలా రుచిగా ఉంటాయి. బంగాళాదుంపలతో చేసే ఈ కూరలు ఎటువంటి వాటితోనైనా తినడానికి చక్కగా ఉంటాయి. అందులో భాగంగా జీడిపప్పు వేసి బంగాళాదుంపలతో మసాలా కూరను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆలూ జీడిపప్పు మసాలా కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉడికించి ముక్కలుగా చేసిన బంగాళాదుంపలు – అర కిలో, గంట పాటు నానబెట్టిన జీడి పప్పు – ముప్పావు కప్పు, చిన్నగా తరిగిన పెద్ద ఉల్లిపాయ – 1, టమాట ఫ్యూరీ – ఒక కప్పు, తరిగిన పచ్చిమిర్చి – 3, నూనె – 2 టేబుల్ స్పూన్స్, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు- తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్ లేదా తగినంత, ధనియాల పొడి – అర టీ స్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, కసూరి మెంతి – ఒక టీ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
ఆలూ జీడిపప్పు మసాలా కూర తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాచ ముక్కలు వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కలపాలి. దీనిని నిమిషం పాటు వేయించిన తరువాత టమాట ఫ్యూరీ వేసి కలపాలి. దీనిని నూనె పైకి తేలే వరకు వేయించిన తరువాత జీడిపప్పు, బంగాళాదుంప ముక్కలు వేసి కలపాలి.
తరువాత ఒక గ్లాస్ నీళ్లు పోసి కలపాలి. దీనిపై మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత గరం మసాలా, కసూరి మెంతి, పచ్చిమిర్చి వేసి కలపాలి. దీనిని మరో రెండు నిమిషాల పాటు ఉడికించిన తరువాత కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ జీడిపప్పు మసాలా కూర తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, పుల్కా, రోటీ, పులావ్ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. బంగాళాదుంపలతో అప్పుడప్పుడూ ఈ విధంగా కూడా చేసుకుని తినవచ్చు. ఈ కూరను కూడా అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.